Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటినే కాపీ కొట్టి అమలుచేస్తున్న కేంద్ర ప్రభుత్వం : ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవ తెలంగాణ-కొండపాక
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వం డిల్లీలో మెచ్చుకుంటూ, వాటిని కాపీ కొట్టి దేశవ్యాప్తంగా అమలుచేస్తున్నారని, మరోపక్క గల్లీల్లో తిడుతున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను కాపీ కొట్టారని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ సమీపంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య కళాశాల భవన నిర్మాణానికి పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధా కృష్ణశర్మతో కలిసి ఆదివారం మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొర్రెల పంపిణీ పథకంతో ఒకప్పుడు మాంసం దిగుమతి చేసుకున్న రాష్ట్రం నేడు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందన్నారు. మూడు శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 38 శాతం అవార్డులు, దక్షిణ భారతదేశంలోనే అత్యధిక కేంద్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఘాట్ నిర్మాణానికి నాటి కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో అనుమతి ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదు లో పీవీ ఘాట్ నిర్మించడంతో పాటు వెటర్నరీ విశ్వవిద్యాలయానికి పీవీ నరసింహారావు పేరు పెట్టి గౌరవించుకున్నామన్నారు. కాళోజీ పేరిట హెల్త్ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట హార్టికల్చర్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో చెరువులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయన్నారు. విద్యకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందన్నారు. 2014తో పోలిస్తే నేడు తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో బీజేపీ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో మాదిరిగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో లేదన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో 3,72,000 మంది మత్స్యకారులకు సభ్యత్వం అందించామని, మరో లక్ష మందికి అందించను న్నట్టు వెల్లడించారు. 18 ఏండ్లు నిండిన మత్స్య కారులకు మెంబర్ షిప్, 18 ఏండ్లు నిండిన గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. మంత్రి హరీశ్‌రావు లాంటి నాయకుడు సిద్దిపేటకు దొరకడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీసీసీబీ చైర్మెన్ చిట్టి దేవేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొండపాక ఎంపీపీ రాగల సుగుణ దుర్గయ్య, దుద్దెడ సర్పంచ్ ఆరేపల్లి మహదేవ్ గౌడ్, ఎంపీటీసీ గురజాడ బాలాజీ, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.