Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ సంఘటన చత్తీస్‌గఢ్‌లోని ఎర్రంపాడు పరిధి పుట్టపాడు అడవుల్లో ఆదివారం జరిగింది. నిషేధిత సీపీఐ(మావోయిస్టు) చెందిన ఒక యాక్షన్ టీం పోలీసులపై దాడి చేయాలనే లక్ష్యంతో సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులపై ఆదివారం ఉదయం కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో పుట్టపాడు అటవీ ప్రాంతంలో సుమారుగా 6.10 గంటలకు అకస్మాత్తుగా ఒక ఎత్తైన ప్రదేశం నుంచి మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తిరిగి ఎదురు కాల్పులు జరిపారు. కొన్ని నిమిషాల పాటు మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అనంతరం ఆ ప్రదేశంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా రెండు మృతదేహాలు, ఒక ఎస్ఎల్ఆర్ ఆయుధం, ఒక సింగల్ బోర్ తుపాకీ ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన వారిలో.. ఒకరు చర్ల ఎల్ఓఎస్ కమాండర్ మడకం ఎర్రయ్య రాజేష్‌గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు.
పుట్టపాడు ఎన్కౌంటర్ బూటకం : మావోయిస్టు నేత ఆజాద్
నిరాధాయుడైన రాజేష్‌ను బూటకపు ఎన్కౌంటర్ చేశారని అల్లూరి సీతారామరాజు, భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ తెలిపారు. ఆ మేరకు ఆదివారం ఆయన ఓ లేఖ విడుదల చేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు పుట్టపాడు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని ఇందులో కమాండర్ రాజేష్, మరో దళ సభ్యుడు చనిపోయారని, ఒక ఎస్ఎల్ఆర్ తుపాకి దొరికిందని పోలీసులు చెబుతున్న విషయాలు బూటకమని పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు.. ఈ ఎన్‌కౌంటర్‌ను ఖండించాలని సూచించారు. కామ్రేడ్ రాజేష్ పార్టీ పనుల రీత్యా నిరాయుధంగా ఒకరే పుట్టపాడు గ్రామానికి వెళ్ళారు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పట్టుకొని, చిత్రహింసలు పెట్టి కాల్చిచంపి, ఇది నిజమైన ఎన్కౌంటర్ అని నమ్మించడానికి తమతో పాటు తెచ్చుకున్న ఎస్ఎల్ఆర్ తుపాకీని పెట్టారని తెలిపారు. అదేవిధంగా పుట్టపాడు గ్రామానికి చెందిన నందాల్ అనే అమాయక ఆదివాసీని కూడా కాల్చి హత్య చేసారని తెలిపారు. ఇది పోలీసులు పిరికిపంథా చర్య అని విమర్శించారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కంగాల్ గ్రామంలోని ఆదివాసీ మడకం కటుంబంలో రాజేశ్(26) జన్మించినట్టు తెలిపారు. అతని 19వ యేటా విప్లవోద్యమంలో చేరి 2016 నుంచి 2022 అక్టోబర్ వరకు చర్ల ఎల్ఓఎస్ సభ్యునిగా, 2022 అక్టోబర్‌లో చర్ల ఎల్ఓఎస్ కమాండర్‌గా ప్రమోట్ అయి సేవలందిస్తున్నాడు. వీరి హత్యకు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, ఎస్పీ వినిత్, డీఎస్పీ సత్యనారయణ, సీఐ ఆశోక్ ఈ హత్యకు పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు.