Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీక్షా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆరోగ్య సూచిల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానానికి చేర్చాలని, దానికోసం ప్రతి ఒక్కరూ పోటీతత్వంతో పని చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం ప్రజారోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై ఆదివారంనాడాయన సమీక్షా సమావేశం నిర్వహించారు. హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఇ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, టీవీవీపీ కమిషనర్ అజరుకుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు. మెటర్నల్ హెల్త్, కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్, ఇమ్యునైజేషన్, ఎన్సీడీ ప్రోగ్రాం, టెలి మానస్, బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్, ఆరోగ్య మహిళ సహా పలు కార్యక్రమాల అమలు తీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనీ, మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత లేకుండా చూసుకుంటామన్నారు. ప్రభుత్వ కషికి తోడు ఆరోగ్య శాఖలోని ప్రతి ఒక్క సిబ్బంది బాధ్యతతో సహకరించాలన్నారు. జిల్లా ప్రజల ఆరోగ్య సంరక్షణ విషయంలో డీఎంహెచ్ఓలు, డిప్యూటీ డీఎంహెచ్ఓలదే కీలక పాత్ర అని చెప్పారు. ఒక పేషెంట్ పీహెచ్సీ పరిధి దాటి రిఫరల్ ఆస్పత్రి వద్దకు వచ్చి చికిత్స చేయించుకొని తిరిగి వెళ్లాక, ఆ పేషెంట్ ఆరోగ్య పరిస్థితిపై మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత స్థానికి ఆరోగ్య అధికారులకు ఉంటుందన్నారు. జిల్లా పరిధిలోనే మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయనీ, అందువల్ల అక్కడే మంచి వైద్యం అందించాలన్నారు. అవసరం అయితేనే ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఆస్పత్రులకు రిఫర్ చేయాలన్నారు. బస్తీ దవాఖానాల్లో ఓపీ పెరగాలని, ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు దవాఖాన తెరిచి ఉంటుందని బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటల్లోగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా పరీక్ష ఫలితాలు అందించి, చికిత్స అందేలా చూడాలన్నారు. పాలియేటివ్ సేవల గురించి ప్రచారం కల్పించాలనీ, మహిళల సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమం గొప్పదని, ప్రతి మంగళవారం పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. వైద్యాధికారులు ప్రతి మంగళవారం క్లినిక్స్ సందర్శించాలన్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి పరిష్కారంగా ప్రారంభించిన టెలి మానస్ 14416 టోల్ ఫ్రీ నెంబర్‌కు విస్త్రుత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని, సాధారణ డెలివరీలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గైనకాలజిస్టుల వారీగా పరిశీలన నిర్వహిస్తామన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతుండటంపై పరిశీలన చేయాలనీ, వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓలను ఆదేశించారు.
వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వోలు, డీఎంహెచ్వోలు ఎక్కువగా ఫీల్డ్ విజిట్స్ చేయాలని, పనితీరును మెరుగుపర్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనిచేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు ఉంటాయనీ, అదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.