Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రానికి బంగారుబాతు లాంటి ఆర్థిక వనరు అయిన ఔటర్ రింగురోడ్డును ఐఆర్బీకి 30 ఏండ్ల పాటు కాంట్రాక్టు ఇవ్వడం వెనుక పెద్ద కుంభకోణం ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టే ఓఆర్ఆర్ను ప్రయివేటు సంస్థలకు కాంట్రాక్టు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ప్రకాశ్‌రెడ్డి, రచనారెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలను నమ్మించి మోసం చేయడంలో కల్వకుంట్ల కుటుంబం ఆరితేరిందని విమర్శించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరిస్తున్నారనీ, దాన్ని వ్యతిరేకిస్తూ టెండర్లలో పాల్గొంటామని ఊదరగొట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ను ఎందుకు ప్రయివేటుపరం చేస్తోందని ప్రశ్నించారు. ఓఆర్ఆర్పై ఏటేటా ఆదాయం పెరుగుతుందనీ, అలాంటప్పుడు ఆదాయం తగ్గించి టెండర్ ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా ఐఆర్బీకి టెండర్ కట్టబెట్టారని విమర్శించారు. హెచ్ఎమ్డీఏ మాస్టర్ ప్లాన్‌కు 2031 వరకు మాత్రమే ఆమోదం ఉందనీ, అలాంటప్పుడు 30 ఏండ్లకు ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియ చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. క్రిసిల్ కంపెనీ ఓఆర్ఆర్పై అధ్యయనం చేసి ఒక రిపోర్టు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ రిపోర్టును బయటపెట్టడం లేదని విమర్శించారు. మణిపూర్‌లో చెలరేగుతున్న హింసపై మంత్రి స్పందిస్తూ...అల్లర్లు, హింస ద్వారా ప్రయోజనమేమీ ఉండదనీ, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు.
బీజేపీ ఆఫీసులో అల్లూరి సీతారామరాజు వర్థంతి
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్థంతిని ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్, కేంద్ర పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.