Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామారెడ్డిలో అమానవీయ ఘటన
నవతెలంగాణ-కామారెడ్డి(తాడ్వాయి)
ప్రస్తుతం సమాజంలో రోజురోజుకూ డబ్బుపై పెరుగుతున్న వ్యామోహం.. కుటుంబ బాంధవ్యాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఇన్ని రోజులు తల్లిదండ్రుల బాగోగులు చూడని కొడుకులను చూశాం. తాజాగా ఓ ఇద్దరు కూతుర్లు తమకు ఆస్తి పంపకాలు చేపట్టలేదని తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించిన అమానవీయ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి పట్టణంలోని ఆర్బీనగర్కు చెందిన కిష్టవ్వ(70)కు ముగ్గురు కుమార్తెలు. ఇటీవల ఒక కూతురు మృతిచెందగా.. ఇద్దరు కూతుర్లు పట్టణంలోనే నివసిస్తున్నారు. కిష్టవ్వ పేరు మీద ఇల్లుతో పాటు బ్యాంక్లో రూ.1.15 లక్షలున్నట్టు సమాచారం. ఆమె ఆస్తులకు సంబంధించి సమీప బంధువు నామినీగా ఉన్నారు. అయితే ఆ డబ్బులను తమకు ఇవ్వాలని కొన్ని రోజులుగా ఇద్దరు కూతుర్లు వచ్చి అడిగారు. ఈ విషయంలో కొన్ని రోజులుగా గొడవలు చోటుచేసుకోవడంతో కిష్టవ్వ అనారోగ్యానికి గురైంది. గత నెల 21 నుంచి కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతిచెందినట్టు వైద్య సిబ్బంది వారి కూతుర్లకు సమాచారం ఇచ్చారు. ఆమె బతికి ఉన్నప్పుడు బ్యాంక్ డబ్బులు అడిగితే ఇవ్వలేదని, తాము ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లబోమని కూతుర్లు తెలిపినట్టు వైద్య సిబ్బంది తెలిపారు.దాంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కూతుర్లు ఉండి కూడా అనాథ శవంగా ఆస్పత్రిలో ఆమె మృతదేహం ఉండటం స్థానికులను చలించింది. కాగా ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.