Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ కార్మికుల కోసం చేసిన త్యాగాలు వెలకట్టలేనివి : 4వ వర్థంతి సభలో టీఎస్‌యూఈఈయూ నేతలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్‌యూఈఈయూ-సీఐటీయూ) మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ చేసిన సేవలు ఎనలేనివని పలువురు నేతలు కొనియాడారు. ఆదివారంనాడిక్కడి మింట్ కాంపౌండ్‌లోని యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో కిరణ్ నాల్గవ వర్థంతి సభ జరిగింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కే ఈశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ గోవర్ధన్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ జే ప్రసాదరాజు, కోశాధికారి జే బస్వరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. కిరణ్ అమర్‌రహే, కిరణ్ ఆశాలు సాధిస్తాం అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలోని 23 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిజన్స్‌గా గుర్తించడంలో కిరణ్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఇటీవల జరిగిన వేతన ఒప్పంద సమయంలో, ఏప్రిల్ 25 నుంచి జరిగిన ఆర్టిజన్ కార్మికుల సమ్మెలో 200 మందిని సర్వీస్ నుంచి తొలగించిన ఘటనల్లో కిరణ్ లేని లోటు స్పష్టంగా కన్పించిందని భావోద్వేగానికి లోనయ్యారు.
చిన్నా పెద్ద భేదం లేకుండా అన్ని యూనియన్లు, అందరు నేతల్ని కలుపుకొని వెళ్లడంలో కిరణ్ వ్యక్తిత్వం చాలా గొప్పదని కొనియాడారు. విద్యుత్ కార్మికుల భవిష్యత్ కోసం నిరంతరం తపనపడుతూ కిరణ్ అనేక త్యాగాలు చేశారనీ, ఆ స్ఫూర్తితోనే రాబోయే రోజుల్లో ఆర్టిజన్స్ కన్వర్షన్, పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనాలు, అన్మెండ్ కార్మికుల్ని ఆర్టిజెన్స్గా గుర్తించడం కోసం పోరాటాలు కొనసాగిస్తామన్నారు. కిరణ్ వర్థంతి సభలు రాష్ట్రవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగాయి. ఆయా సభల్లో విద్యుత్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కిరణ్‌కు నివాళులు అర్పించారు.