Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల్లూరు నరసింహారావు
అమెరికా న్యాయవ్యవస్థ అవినీతిమయం అయిందని గత వారం రోజులుగా వెల్లడౌతున్న వాస్తవాలు తెలియజేస్తున్నాయి. ముందుగా అత్యంత అవినీతిపరులైన జస్టీస్ క్లారెన్స్ థామస్, ఆయన భార్య వర్జీనియా జిన్నీ థామస్ చుట్టూ తిరిగిన ఈ కుంభకోణం ఆ తరువాత ప్రధాన న్యాయమూర్తితో పాటు యావత్ సుప్రీం కోర్టును ఆవహించింది. ప్రజాస్వామ్య, కార్మికవర్గ వ్యతిరేకి అయిన క్లారెన్స్ థామస్ రిపబ్లికన్ పార్టీకి చెందిన బిలియనైర్ హర్లాన్ క్రో నుంచి లక్షలాది డాలర్ల విలువైన 'బహుమతుల'ను అందుకున్నట్టు పరిశోధక జర్నలిజం వెబ్ సైట్ ''ప్రొపబ్లికా'' అనేక డాక్యుమెంట్లను ప్రచురించింది. ఈ హర్లాన్ క్రో హిట్లర్, నాజీల జ్ఞాపికలను సేకరించి తన టెక్సాస్ భవనంలో ప్రదర్శిస్తుంటాడు. అంతేకాదు తనకు మార్క్సిజం అంటే భయమంటాడు.
రెండు దశాబ్దాలపాటు థామస్, అతని భార్య చేసిన విహార యాత్రల వ్యయాన్ని హర్లాన్ క్రో భరించాడు. వీటిని థామస్ తన ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలోగానీ, మరెక్కడా కూడా ప్రకటించలేదు. ఫెడరల్ కోర్టులను ప్రగతినిరోధకులతో నింపటానికి ఇతనికి ఫాసిస్టు మేధావులు, కార్పొరేట్ పెట్టుబడిదారులు, మితవాద రాజకీయ నాయకులు సహకరించే వారు.1991లో హైకోర్టులో చేరిన తరువాత థామస్ అనేక అప్రజాస్వామిక, కార్పొరేట్ అనుకూల తీర్పులను ఇవ్వటం జరిగింది. ఈ తీర్పుల్లో 2000వ సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్ని కల్లో ఫ్లోరిడా ఓట్లను తిరిగిలెక్కించకుండా చేసి ఓడిపోయిన బుష్‌ను గెలిచేలా చేసిన ''బుష్ వర్సెస్ గోర్'' కేసు (5అనుకూలం 4ప్రతికూలం) తీర్పుకూడా ఉంది.
థామస్ భాగస్వామ్యంతో ఇచ్చిన తీర్పుల్లో ఎన్నికల ప్రచారానికి కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే డొనేషన్లకు పరిమితిని ఎత్తివేసిన ''సిటిజెన్ యునైటెడ్ వర్సెస్ ఎఫ్‌ఇసి'' కేసు, మహిళలు ఎబార్షన్ చేయించుకోవటానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కును రద్దు చేసిన ''డాబ్స్ వర్సెస్ జాక్సన్ విమెన్ హెల్త్'' కేసులు కూడా ఉన్నాయి. 2020 అధ్యక్ష ఎన్నికల తీర్పును బైడెన్‌కు వ్యతిరేకంగా మలచటానికి చేసిన ప్రయత్నంలో థామస్ భార్య జిన్నీ భాగస్వామి అయినప్పటికీ ఆ కేసును విచారిస్తున్న బెంచ్ నుంచి వైదొలగటానికి (రెక్యూస్) ఆయన తిరస్కరించాడు. ఇలా అనేక ఆర్థిక అవకతవకలకు థామస్, అతని భార్య జిన్నీ పాల్పడినట్టు ''ప్రొపబ్లికా'' వెబ్ సైట్ అనేక డాక్యుమెంట్లను ప్రచురించింది. వీళ్ళ అవినీతిని గురించి వాషిగ్టన్ పోస్ట్ కూడా నిర్దారించటమే కాకుండా అనేక కొత్త విషయాలను కూడా రాసింది.
అయితే అవినీతి, అప్రకటితంగా బహు మతులను అందుకోవటం, ఇతరుల డబ్బుతో విహారయాత్రలు చేయటం, ఉపన్యాసాలను లాభసాటిగా మార్చటం, సంపన్నులతో ఆర్థిక లావాదేవీలను కలిగివుండటం థామస్‌కి, రిపబ్లికన్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఇటీవల కాలంలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి: 2017లో హైకోర్టుకు ప్రమోట్ అయ్యాక ట్రంప్ చేత నియమింపబడిన నీల్ గోర్సచ్ తన ఆస్తిని ఒక లా ఫర్మ్ సిఈఓకి అమ్మటం జరిగింది. ఆ ఫర్మ్ కేసులు కోర్టు ముందున్నవిషయం అందరికీ తెలుసు. కానీ ఈ ఆస్తి అమ్మకం గురించి ఎక్కడా వెల్లడించలేదు. 2007-2014 సంవత్సరాల మధ్యకాలంలో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ భార్య జేన్ రాబర్ట్స్ ఖరీదైన లాయర్లను నియమించి ప్రముఖ లా ఫర్మ్లా నుంచి 10.3మిలియన్ డాలర్ల కమిషన్లను అందుకుంది. ఆ లా ఫర్మ్లాలో కనీసం ఒక కేసును ప్రధాన న్యాయమూర్తి భార్యకు వేల డాలర్లను సమర్పించిన తరువాత ఆ లా పర్మ్లాలో ఒక పర్మ్ వాదించటం జరిగింది. ఈ సమాచారాన్ని ఒక ప్రజావేగు(విజిల్ బ్లోయర్) వెల్లడించాడు తప్ప ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ వెల్లడించలేదు.
అలాగే 2004-2018 సంవత్సరాల మధ్యకాలంలో డెమోక్రాటిక్ పార్టీకి చెందిన జస్టీస్ స్టీఫెన్ బ్రేయర్ ఐరోపా, జపాన్, ఇండియా, హవారులకు అనేకసార్లు చేసిన విహారయాత్రలకు అయిన వ్యయాన్ని ఇతరులు భరించారు. అటువంటి విహారయాత్రలలో ఒకదాని వ్యయాన్ని ఒక ప్రయివేటు ఈక్విటీ పెట్టుబడిదారు డేవిడ్ రూబెన్ స్టైన్ భరించాడు. కొన్ని విహారయాత్రల వ్యయాన్ని అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలోవున్నప్రిట్జ్ కర్ కుటుంబం భరించింది. 2018లో దివంగత జస్టీస్ రుత్ బాడర్ గిన్స్ బర్గ్ చేసిన ఇజ్రాయిల్ యాత్రకు అయిన వ్యయాన్ని కోర్టుముందు వ్యాపార సంబంధిత కేసున్న ఇజ్రాయిలీ బిలియనీర్ మోరిస్ ఖాన్ భరించాడు.
ఇలా చెప్పుకుంటూపోతే అమెరికా న్యాయ వ్యవస్థలో జరిగిన అవినీతి కథలకు అంతే ఉండదు. కార్పొరేట్ క్యాష్, రాజకీయ పలుకుబడి, ఫెడరల్ న్యాయ వ్యవస్థ మధ్యగల అవినాభావసంబంధం గురించి పాలక వర్గాలకు, కార్పొరేట్ మీడియాకు బాగా తెలుసు. ఇప్పటిదాకా ఈ అక్రమ సంబంధం గురించి సాధారణ ప్రజలకు తెలియకుండా చేశారు. ప్రస్తుతం ఐరోపాలో జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం, ఒక మాజీ అధ్యక్షుడి తిరుగుబాటుతో డీలాపడిన రాజకీయ వ్యవస్థ, ఆర్థిక సంక్షోభం, ప్రజలకు చుక్కలు చూపుతున్న ధరల పెరుగుదల, అమెరికాలోను, అంతర్జాతీయంగాను చెలరేగుతున్న కార్మికవర్గ తిరుగుబాట్లతో సతమతమౌతున్న పాలక వర్గాలకు అవినీతిలో కూరుకుపోయి పరువుపోగొట్టుకుంటున్న సుప్రీంకోర్టు వ్యవహారం మరింత తలపోటుకు కారణమౌతోంది. ''చట్ట పాలన''ను కాపాడే సంస్థగా ఒకప్పుడు ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న సుప్రీం కోర్టును ఒక తాజా ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం నేడు కేవలం 25శాతం ప్రజలు మాత్రమే గౌరవిస్తున్నారు. అధ్యక్ష, కాంగ్రెస్(అమెరికా శాసన వ్యవస్థ)వ్యవస్థలలాగానే సుప్రీం కోర్టు కూడా ప్రజల ద్రుష్టిలో రోజురోజుకూ చులకనైపోతోందని ఈ మధ్య కాలంలో న్యూయార్క్ టైమ్స్ తన విచారాన్ని వ్యక్తం చేసింది.
అమెరికా న్యాయ వ్యవస్థలో ప్రజల ప్రమేయం లేకుండా జీవితకాలం పదవిలో కొనసాగే న్యాయమూర్తుల అవినీతి ప్రజల ప్రజాస్వామిక, సామాజిక హక్కులపైన దాడిగా పరిణమిస్తోంది. నిజానికి ఇది పెట్టుబడిదారీ వ్యవస్థలో పాలక వర్గ ఆధిపత్యాన్ని కొనసాగేలాచేసే ఏర్పాటులో భాగమే. దీన్ని విడిగా సంస్కరించటం దుస్సాధ్యం. సమాజ విప్లవీకరణతో మాత్రమే మిగిలిన వాటితోపాటుగా న్యాయ వ్యవస్థ కూడా పునఃనిర్మించబడుతుందని చెప్పనక్కరలేదనుకుంటా.