Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
- కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై ఫిర్యాదు
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
కర్నాటకలో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులను చంపుతామని బెదిరిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మణికంఠపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. ఆదివారం కాంగ్రెస్ నాయకులు సంపత్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్ ఇతర నాయకులతో కలిసి ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మణికంఠపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అందుకు సంబంధించిన ఆడియో టేప్‌ను ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డికి అందజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటకలో ఓటమి భయంతో చిత్తాపూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మణికంఠ బహిరంగంగా చిత్తాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక ఖర్గేను, వారి తండ్రి మల్లికార్జున ఖర్గేను, వారి కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించారని తెలిపారు. దాంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ గెలుస్తుందని, అందుకు ఉదాహరణ ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం అన్నారు. ఇప్పుడు కర్నాటకలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని, అలాగే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.