Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
- పలు జిల్లాల్లో ముగిసిన మేడే వారోత్సవాలు
నవతెలంగాణ-భువనగిరి
కార్మిక హక్కులను కాలరాస్తూ ఉద్యమాలను ఆపలేరని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య ప్రభుత్వాలను హెచ్చరించారు. ఆదివారం 137వ మేడే వారోత్సవాల ముగింపు సందర్భంగా పలు జిల్లాల్లో సభలు నిర్వహించారు. యాద్రాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రిన్స్చౌరస్తా వద్ద సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన జరిగిన సభలో వీరయ్య పాల్గొని మాట్లాడారు. 137 ఏండ్ల కిందటే కార్మికుల ఎనిమిదిగంటల పని దినాన్ని సాధించడం కోసం, కార్మికులు హక్కుల కోసం పోరాడి ప్రాణాలను సైతం అర్పించారే తప్ప వెనకడుగు వేయలేదన్నారు. ఆ అమరవీరుల స్ఫూర్తితో నేడు కార్మిక ఐక్యఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కులం, మతం పేరుతో కార్మికుల మధ్య భావోద్వేగాలను రెచ్చగొడుతూ కార్మికవర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను ప్రభుత్వాలు పొందుతున్నారని తెలిపారు. కార్మిక వర్గం ఇది గ్రహించిన రోజు ప్రభుత్వాలు కుప్పకూలుతాయని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెట్టడంతో పాటు నిత్యం పెంచుతున్న నిత్యావసర ధరలు పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్నారన్నారు. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్కోడ్లను కేంద్రం తీసుకువచ్చిందని, ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలుగా చేసిందని విమర్శించారు. దేశం మొత్తం కరోనాతో అతలాకుతలమైతే మోడీ ప్రభుత్వం మాత్రం పారిశ్రామిక వేత్తలకు ఊడిగం చేస్తూ రూ.70 వేలకోట్లు పారిశ్రామికవేత్తలకు రద్దు చేసిందన్నారు. మేడే వారోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన వివిధ క్రీడల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. బహిరంగ సభలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ పాషా, గొరిగే సోములు, తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అమరవరంలో జరిగిన మేడే కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి హాజరయ్యారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి పలు చోట్ల జెండాను ఎగురవేశారు.
సీఐటీయూ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సంఘం కార్యాలయం నుంచి ఈసీఐఎల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం చౌరస్తాలో సభ నిర్వహించారు. ఈ సభకు సీఐటీయూ మేడ్చల్ జిల్లా కార్యదర్శి జే చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా సీనియర్ నాయకులు కోమటి రవి, పీఎస్ఎన్ మూర్తి, జిల్లా సహాయ కార్యదర్శి జీ శ్రీనివాసులు ప్రసంగించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని అన్నానగర్ అమరవీరుల స్తూపం వద్ద అంబేద్కర్ సంఘం సెంట్రింగ్ యూనియన్ జెండా ఏర్పాటు చేశారు.
అనంతరం మేడే వారోత్సవాల కార్యక్రమాలు నిర్వహించారు. కార్మికులకు. పిల్లలకు, మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.