Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ జనగణన ఎందుకు చేయటం లేదు
- తెలంగాణలో పాగా వేయాలి : 'తెలంగాణ భరోసా' సభలో బీఎస్పీ అధినేత్రి మాయావతి
- సీఎం అభ్యర్థిగా ప్రవీణ్‌కుమార్ ప్రకటన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు.ఆ రెండు పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన 'తెలంగాణ భరోసా సభ'కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం బీసీ జనగణన ఎందుకు చేయటం లేదో చెప్పాలని ప్రశ్నించారు. కాన్షీరామ్ పోరాట మార్గంలో బీఎస్పీ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలనీ, రాష్ట్రంలో అధికారం చేజిక్కిం చుకోవాలని ఆయా శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీల కోసం అంబేద్కర్ రిజర్వేషన్లు తెచ్చినా.. వాటి అభివృద్ధి ఫలాలు ఇంకా ఆయా వర్గాల చెంతకు చేరలేదన్నారు. వారి కోసం మరిన్ని చట్టాలు తేవాలంటూ నాడు న్యాయ శాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్ భావించారనీ, ఆయన సూచనలను అప్పటి ప్రధాని నెహ్రూ లక్ష్య పెట్టలేదని తెలిపారు. జ్యోతిబా ఫూలే, అంబేద్కర్, నారాయణగురు చూపిన బాటలో పయనిద్దామని పిలుపునిచ్చారు. వారందరూ బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశానని మాయావతి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి బీఎస్పీ సంపూర్ణ మద్దతినిచ్చిందని గుర్తు చేశారు. బీఎస్పీ ఎస్సీల కోసమే కాదనీ, సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నదని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపామ న్నారు. రాష్ట్రంలో దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని చెప్పి, సీఎం కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. తెలంగాణకు చెందిన జి.కష్ణయ్య అనే ఐఏఎస్ అధికారి హత్యకు కారణ మైన నిందితుడిని బీహార్ ప్రభుత్వం విడుదల చేస్తే కేసీఆర్ మౌనంగా ఉండటమేంటని ప్రశ్నిం చారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఆమె ప్రకటించారు.
రైతులను ఆదుకోవటంలో సీఎం విఫలం.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వారిని ఆదుకోవ టంలో సీఎం కేసీఆర్ విఫల మయ్యారని చెప్పారు. రాష్ట్రంలో బీసీ, ఎస్టీ, ఎస్సీలు, మైనార్టీలు ఏకం కావాలని పిలుపు నిచ్చారు. బీసీనని చెప్పుకొంటున్న ప్రధాని మోడీ.. ఆయా కులాలకు ఏం చేశారని ప్రశ్నించారు.
తెలంగాణలో బహుజన రాజ్యం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సరూర్‌నగర్ సభకు రాష్ట్ర నలు మూలల నుంచి బీఎస్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్య క్రమంలో రాజ్య సభ సభ్యులు రాంజీ గౌతమ్, రాష్ట్ర సమన్వయ కర్త మందా ప్రభాకర్, బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పరంజ్యోతి, అధికార ప్రతినిధి సాంబశివగౌడ్, జిల్లాల ఇన్‌ఛార్జిలు మాట్లాడారు.