Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏటా 2 లక్షల కొలువులు ...జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం
- అమరుల తల్లిదండ్రులకు నెలకు రూ.25 వేల పెన్షన్
- హామీలు నెరవేర్చకపోతే మా సర్కారునూ కూల్చేయండి
- తెలంగాణ నేల మాత్రమే కాదు.. తల్లి
- ఏ ఒక్కరో పోరాడితే రాష్ట్రం రాలేదు
- ఎందరో ఆత్మ బలిదానాలు చేశారు
- మా కుటుంబమూ బలిదానాలు చేసింది
- ఆ బాధేంటో మాకు తెలుసు
- ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చలేదు : ప్రియాంక గాంధీ
రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ తన కార్యాచరణను ప్రకటించింది. రాష్ట్రంలోని యువతే లక్ష్యంగా 'యూత్ డిక్లరేషన్' పేరుతో నిర్వహించిన సభలో వారిని ఆకర్షించేందుకు పలు హామీలను గుప్పించారు. హైదరాబాద్ సరూర్‌నగర్ మైదానంలో నిర్వహించిన ఈ బహిరంగ సభలో కేసీఆర్ సర్కార్‌పై ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. తెలంగాణ ఏర్పాటు, బలిదానాలు, నిరుద్యోగ భృతి తదితరాంశాలను ఆమె ఏకరువు పెట్టారు. హామీలు నెరవేర్చకపోతే తమ ప్రభుత్వాన్నయినా కూల్చేయండంటూ ప్రజలకు సూచించారు. కాకపోతే ఒక జాతీయ పార్టీ నేతగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఆమె పల్లెత్తుమాట అనకపోవటం ఇక్కడ గమనార్హం.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'తెలంగాణ నేల కాదు.. తల్లి వంటిది' అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. 40 ఏండ్ల క్రితం చనిపోయిన ఇందిరమ్మను గుర్తు పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వలేమని ఆమె స్పష్టం చేశారు. పూర్తి బాధ్యతతోనే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. అదే బాధ్యతతో యూత్ డిక్లరేషన్‌ను ప్రకటిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక హామీలు నెరవేర్చలేకపోతే ఆ సర్కారును సైతం కూల్చేయాలని సూచించారు. తెలంగాణను బలోపేతం చేయాల్సిన అవసరముందని చెప్పారు. దేశంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ చేసిన పనులకు బీజేపీ పాలకులు పేర్లు మార్చి తమవిగా చెప్పు కుంటున్నారని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన 'యువ సంఘర్షణ సభ'లో ప్రియాంకగాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా 'జైబోలో తెలంగాణ' అని ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మిత్రులారా అంటూ తెలుగులో మాట్లాడారు. శ్రీకాంతా చారి గురించి ప్రస్తావిం చారు. 'నన్ను మరో ఇందిర అంటారు. అలా అన్నప్పు డు నా బాధ్యత తెలుస్తుంది' అన్నారు. త్వరలో తెలం గాణలో ఎన్నికలు జరగనున్నాయనీ, ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయంలో ప్రజలు జాగరూకతతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆ చైతన్యంతోనే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు.
అంత ఈజీగా ఆ నిర్ణయం తీసుకోలేదు...
'నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఏ ఒక్కరో పోరాడితే తెలంగాణ రాలేదు. తెలంగాణ కోసం ఎందరో ఆత్మ బలి దానాలు చేశారు. మా కుటుంబం కూడా ఎన్నో త్యాగాలు చేసింది. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. బలిదానాలు వథా కాకూడదని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి' అని ప్రియాంక గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం అంత ఈజీగా చేసింది కాదన్నారు. ఇక్కడ అధికారంలోకి రావాలని ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదనీ, ప్రజల ఆకాంక్షల మేరకే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ వచ్చిన రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాలు కల్వకుంట్ల కుటుంబా నికే పరిమితం అయ్యాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చి 9 ఏండ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదనీ, ఆత్మబలిదానాలు వృథా అయ్యాయని అన్నారు. తెలంగాణ కోసం అన్ని వర్గాల వారూ పోరాడారని తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని తాము భావించామని అన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో 30లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారనీ, ఉద్యోగాలు లేక లక్షలాది మంది నిరుద్యోగులు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారనీ, మన ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? చెప్పాలన్నారు. 2018 ఎన్నికల్లో రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారని విమర్శించారు.
లీకుల మీద లీకులు...
మరో పక్క పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నాయనీ, పేపర్ లీకేజీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదనీ, వాటిలో ఖాళీలను భర్తీ చేయలేదన్నారు. ప్రయివేటు యూని వర్సిటీలకు మాత్రం అనుమతులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ప్రభుత్వ బడుల్లో చేరేవారి సంఖ్య తగ్గిందనీ, బడ్జెట్లో విద్యకు కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. ప్రతి వ్యక్తిపై లక్షల రూపాయల అప్పులు మోపారనీ, కాంగ్రెస్ ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తుందని ప్రకటించారు. తెలంగాణ ఏర్పడ్డాక 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు చేయలేదన్నారు. నిరుద్యోగ భతి రూ.3 వేలు ఇస్తామని చెప్పినా బీఆర్ఎస్ అమలు చేయ లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ. 4 వేలు భతి ఇస్తామని ప్రకటించారు. యువతకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు 75శాతం కోటా
- యువతకు రూ.10లక్షలు వడ్డీ లేని రుణాలు
- పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పిల్లల కోసం ప్రత్యేక విద్యాలయాలు
- చదువుకునే 18 ఏండ్లు పైబడిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు : యూత్ డిక్లరేషన్ ప్రకటించిన రేవంత్ రెడ్డి
యువత భవితే తమ పార్టీ నినాదమనీ, అమరుల ఆశయ సాధనే కాంగ్రెస్ విధానమని టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రకటించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వరకూ ప్రతి నెలా రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులుబాసిన అమరులను గుర్తించుకునేలా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ప్రతి నెలా రూ.25 వేల గౌరవ వేతనం ఇస్తామని వెల్లడించారు. పోలీసులు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల చదువుల కోసం వరంగల్, హైదరాబాద్‌లో రెండు ప్రత్యేక విద్యాలయాలను నెలకొల్పుతామని తెలిపారు. 18 ఏండ్లు పైబడి చదువునే ప్రతి విద్యార్థినికీ ఎలక్ట్రిక్ స్కూటీలను ఇస్తామని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో యువ సంఘర్షణ సభ ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. తెలంగాణలోని యూనివర్సిటీలు ఆత్మగౌరవ ప్రతీకలన్నారు. మన 'రాష్ట్రం-మన కొలువులు' నినాదంతో యువతీయువకులు లాఠీ దెబ్బలు తిన్నారు, ప్రాణాలు అర్పించారు' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 12.50 లక్షలు ఉంటే, విభజన తర్వాత తెలంగాణకు 5.30లక్షలు ఉద్యోగులను కేటాయించారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 1.7 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. కేసీఆర్ పాలనలో యువతకు న్యాయం జరగదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ హామీలు నెరవేరుస్తామని ప్రకటించారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తిస్తామని ప్రకటించారు. అలాగే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ. 25 వేల గౌరవ పెన్షన్ ఇస్తామని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ సమరయోధులపై ఉన్న అక్రమ కేసులు ఎత్తివేస్తామన్నారు. ఏటా జూన్ 2న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామనీ, సెప్టెంబర్‌లో నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ముఖ్యాంశాలు
- తొలి, మలి దశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తిస్తాం.
- అమరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, తల్లి/తండ్రి/భార్యకు రూ. 25 వేల గౌరవ పెన్షన్ ఇస్తాం.
- తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తేస్తాం.
- జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అందజేత.
- అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
- తొలి ఏడాదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ.
- జూన్ 2న జాబ్ క్యాలెండర్ విడుదల. సెప్టెంబర్ 17లోపు నియామక పత్రాల అందజేత.
- ప్రతినెలా రూ.4వేల నిరుద్యోగ భృతి చెల్లింపు
- ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ.
- నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు.
- 7 జోన్లలో ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లను, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పుతాం.
- ప్రభుత్వ రాయితీలు పొందే ప్రయివేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్ కల్పన.
- విద్య, ఉపాధి అవకాశాల మెరుగుదలకు యూత్ కమిషన్ ఏర్పాటు.
- రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయ కల్పన.
- ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ, మరియు గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనతో పాటు, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాం. పాత బకాయిలు పూర్తిగా చెల్లింపు.
- పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్పు
- ఆదిలాబాద్, ఖమ్మం, మరియు మెదక్‌లో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు.
- బాసరలోని రాజీవ్ గాంధీ ఐఐఐటీ తరహాలో రాష్ట్రంలో నూతనంగా 4 ఐఐఐటీల ఏర్పాటు
- అమెరికాలోని ఐఎంజీ అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహిస్తాం.
- పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్‌లలో 2 విద్యాలయాలను ఏర్పాటు చేసి ఆరో తరగతి నుంచి పట్టభద్రులయ్యే వరకూ నాణ్యమైన విద్యను అందిస్తాం.
- 18 ఏండ్లు పైబడి చదువుకొనే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ల అందజేత.
విద్యార్థులు, నిరుద్యోగులందరూ ఏకమై పిడికిలి బిగించాలి
తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరోసారి విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు ఏకమై పిడికిలి బిగించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో ఆయన మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో నేడు ఉద్యోగాల్లేక నిరుద్యోగు లు విలవిల్లాడిపోతున్నారన్నారు. విద్యార్థులు, యువత త్యాగాలు చేస్తేనే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించడానికి ప్రియాంక గాంధీ తెలంగాణకు వచ్చారన్నారు. పాదయాత్రలో అనేక సమస్యలను ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాయితీలు కల్పించిందనీ, నేడు చేతివృత్తుల వారికి రాయితీలు ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. పాదయాత్రలో పోచం పల్లి చేనేత కార్మికులు ఇచ్చిన చీరలను ప్రియాంక గాంధీకి సభా వేదికపై భట్టి విక్రమార్క అందజేశారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమర్ అధ్యక్షతన నిర్వ హించిన ఈ సభలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, నేతలు వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, కొండా సురేఖ, మానవతారారు, బలరాం నాయక్, రాములు నాయక్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క