Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత పిచ్చిని తిప్పి కొట్టాలి: సీఎం కేసీఆర్
- నార్సింగిలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌కు శంకుస్థాపన
- ఆలయ నిర్మాణానికి రూ.25 కోట్లు ప్రకటన
నవతెలంగాణ-గండిపేట్
మత పిచ్చి దుష్పరిణామాలను తిప్పి కొట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. మత మౌఢ్యం మనుష్యులను పిచ్చివాళ్లను చేస్తుందని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీకృష్ణ గో సేవా మండలి విరాళంతో నిర్మిస్తున్న హరేకృష్ణ హెరిటేజ్ టవర్ ఆలయ నిర్మాణానికి సోమవారం సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఎత్తయిన 400 అడుగుల ఎత్తు రాధాకృష్ణ మందిరం నిర్మించడం అభినందనీయమన్నారు. మత విద్వేషాల జోలికి వెళ్లొద్దని, కొన్ని శక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు. నగరంలో ఈ ప్రాజెక్టు చేపట్టడం సంతోషంగా ఉందని, చిత్తశుద్ధి, అంకితభావంతో ముందుకెళ్లాలని తెలిపారు. ఇది నగరానికి సాంస్కృతిక మైలురాయిగా నిలువడంతో పాటు దేశ ప్రజలకు ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున ఆలయ నిర్మాణానికి రూ.25కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అక్షయపాత్ర సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీ వాణిదేవి, రంగారెడ్డి జడ్పీ ఛైర్పర్సన్ అనితారెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, కార్యదర్శి అరవింద్‌కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఆర్డీఓ చంద్రకళ, చైర్పర్సన్ రేఖాయాదగిరి, వైస్ చైర్మెన్ వెంకటేష్‌యాదవ్, కమిషనర్ సత్యబాబు, హరేకృష్ణ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.