Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పచ్చడి పెట్టలేం.. పండ్లు తినలేం..
- పడిపోయిన మామిడి దిగుబడి
- అమాంతం పెరిగిన ధరలు
- 'నిమ్మ' పరిస్థితీ అంతంతే..
మధురఫలం చేదెక్కింది. పచ్చడి నిలువ చేసుకోవాలనే వారికి, పండ్ల రుచిని ఆస్వాదించాలనే వారికి ఈ సంవత్సరం నిరాశే మిగిలింది. గతంలో మామిడి పండ్లు మార్కెట్లో రోజుకు టన్నుల కొద్దీ రాగా ప్రస్తుతం క్వింటాళ్ళలో కూడా రావడం లేదని మామిడి వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది పూత ఏపుగా వచ్చినా అకాల వర్షాలు, ఈదురుగాలులు, చీడపీడలతో వచ్చిన కాస్త పూత రాలిపోయింది. కాసిన కొన్ని కాయలు రాలిపోయాయి. దాంతో దిగుబడి తగ్గి పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
నవతెలంగాణ-మల్హర్రావు
జయశంకర్-భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలంలో తాడిచెర్ల, రుద్రారం, కాపురం, కొండంపేట గ్రామాల్లో మామిడి తోటలు దాదాపు 500 ఎకరాల్లో ఉన్నాయి. ఈ సంవత్సరం అనుకున్నట్టుగా పూత ఏపుగా వచ్చినా చీడపీడలు ఆశించడంతో పూత, కాత నిలువలేదు. మామిడి కాయల సైజును బట్టి, రకాలను బట్టి మార్కెట్లో ధరలున్నాయి. టన్ను మామిడి ధర రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు పలుకుతోంది. నాలుగు రోజుల క్రితం రికార్డు స్థాయిలో రూ.1.50 లక్షలు పలకడం విశేషం. డిమాండ్ మేర దిగుమతి లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. పండ్ల రసాలు, హైమవతి, బంగినపల్లి కిలో రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తుండగా తోతాపరి కిలో రూ.50 నుంచి రూ.80 పలుకుతోంది. పచ్చడి కాయలు సైజును బట్టి ఒక్కొక్కటి రూ.15 నుంచి రూ.20 చొప్పున అమ్ముతుండటం గమనార్హం.
అటు మామిడి.. ఇటు నిమ్మ..
వాతావరణ మార్పులతో మామిడి పూత కాత తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపిందని ఉద్యానవన అధికారులు పేర్కొంటున్నారు. చలి కాలంలో బారీ వర్షాలు కురవడం, రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడం.. ఫిబ్రవరి నుంచి ఎండలు మండిపోవడం.. మార్చిలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పూత ఎండి పిందె రాలిపోయింది. నిమ్మకాయల పరిస్థితిలోనూ ఎలాంటి మార్పు లేదు. గతంలో ఒక నిమ్మచెట్టుకు 5 నుంచి 6 బస్తాల కాయలు వచ్చేవి. చీడపీడల కారణంగా ఈసారి ఒకటి రెండు బస్తాలకే పరిమితమయింది. వ్యవసాయ మార్కెట్లో బస్తా రూ.2,500 పైగా రిటైల్‌గా సైజును బట్టి ఒక్కొక్క కాయ రూ.10 నుంచి రూ.15 పలుకుతోంది. ప్రస్తుతం పచ్చళ్ళ సీజన్ మొదలైంది. సాధారణంగా ఈ సీజన్లో ప్రతి ఇంట్లో మామిడి, నిమ్మ పచ్చళ్ళని తయారు చేసుకొని ఏడాదంతా నిలువ చేసుకుంటారు. మామిడి, నిమ్మకాయల ధరలకు తోడు వంట నూనెలు, మసాలా దినుసులు, కారం పొడులు కూడా భారీగా పెరగడంతో పచ్చడి మెతుకుల కోసం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆర్డిక బారం తప్పడం లేదు.
రుచి చూడలేక పోతున్నాం : తిరుమల, గృహిణి
సాధారణంగా నలుగురు కుటుంబ సభ్యులున్న ఒక కుటుంబం ఏడాది వినియోగానికి 5 నుంచి 10 కిలోల పచ్చడి తయారుచేసుకోవాలి. పచ్చడిలో వాడే మామిడితోపాటు నూనెలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, కారం ధరలు పెరిగాయి. 5 కిలోల పచ్చడికి గతంలో కంటే అదనంగా రూ.300 ఖర్చు చేయాల్సి వస్తోంది. పచ్చిడి రుచిని ఆస్వాదించాలని ఉన్నా చూడలేకపోతున్నాం.
మిగిలేది అంతంతే
ఆరు ఎకరాల్లో మామిడి సాగు చేశాను గతంతో పోలిస్తే ఈసారి పూత, కాత ఆలస్యంగా వచ్చాయి. చీడపీడల నివారణ కోసం అధికంగా మందులు వాడాల్సి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో పచ్చడి కాయలకు, పండ్ల రసాలకు, బంగినపల్లి కాయలకు మంచి డిమాండ్ ఉంది. కానీ దిగుబడి లేదు. దాంతో ఈఏడాది రూ.2లక్షలు నష్టపోయాను.
- పిట్టల రాజయ్య, మామిడి రైతు