Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే ఉపసంహరించుకోవాలి
- పంచాయతీకార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం దారుణమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ పేర్కొన్నారు. ఆ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని కోరారు. సోమవారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. 'జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఈ నెల 28 నుంచి సమ్మెలో ఉన్నారు. వారి సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నది. వారితో చర్చించి సామరస్యంగా పరిష్కరించకుండా అణిచివేత ధోరణికి పాల్పడుతున్నది. యూనియన్ పెట్టుకున్నందుకు, సమ్మె చేస్తున్నందుకు విధుల్లోకి తొలగిస్తున్నామని నోటీసులు జారీ చేయడం దుర్మార్గం' అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పారిశ్రామిక కార్మికులు యూనియన్ పెట్టుకోవడం, సమ్మె చేయడం హక్కు అని స్పష్టం చేశారు. రెగ్యులర్ చేయాల్సి వస్తే కమిటీ వేసి ఉద్యోగుల పనితీరు ఆధారంగా చేస్తామని మెలిక పెట్టడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేసి సర్వీసు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.