Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాన్షీరాం సిద్ధాంతాలను తుంగలో తొక్కేశారు....
- బీజేపీకి తోక పార్టీగా బీఎస్పీ
- మునుగోడుతో ప్రవీణ్ కుమార్ సత్తా తెలిసింది : ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేసులకు భయపడ్డ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాం సిద్ధాంతాలను తుంగలో తొక్కేశారని రాష్ట్ర ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు విమర్శించారు. సోమవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎస్పీ అనేది బీజేపీకి తోక పార్టీగా మార్చారనీ, అందుకే బీజేపీని పల్లెత్తు మాటనలేదని తెలిపారు. మాయావతి భయపడుతున్న తీరు చూస్తే ఆమె ఆర్థిక నేరాలకు పాల్పడినట్టుగానే భావించాల్సి వస్తుందన్నారు. యూపీలో తన పాలనలో భారీ ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేసిన ఆమె అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ అంటేనే దళితుల సంక్షేమానికి నిలువెత్తు నిదర్శనం అనే రీతిలో సీఎం కేసీఆర్ పాలన ఉందంటూ కొనియాడారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్కు గతంలో ఆరేండ్ల పాటు గురుకులాల సొసైటీ కార్యదర్శిగా కేసీఆర్ అవకాశం కల్పిస్తే దుర్వినియోగం చేసుకుని సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. మాయావతి అధికారంలో ఉండగా దళిత బంధు ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జాతీయ స్థాయి నేత మాయావతి అయితే... బహిరంగ సభలో జాతీయ అంశాలను ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాజకీయాల్లో మాయావతి శకం ముగిసిందని విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ ఆగడాలపై నోరు విప్పి మాయావతి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో అధికారమంటూ పగటి కలలు కనడం మానుకోవాలనీ, బీజేపీ మతతత్వ రాజకీయాలని ప్రశ్నించకపోతే మనుగడే ఉండబోదని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలతో ప్రవీణ్ కుమార్ సత్తా ఏంటో తెలిసిందని ఎద్దేవా చేశారు.