Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు వారాల్లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయండి: మంత్రి హరీశ్ రావు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్యారోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) విడుదల చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని 34 స్పెషాలిటీ విభాగాలకు వీరు ఎంపికయ్యారు. కొత్తగా ప్రారంభమైన మెడికల్ కాలేజీల్లో మెరిట్ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. అభ్యర్థులు కోరుకున్న చోట నియామక ఉత్వర్వులను పొందనున్నారు. భర్తీ ప్రక్రియను కేవలం ఐదు నెలల రికార్డు సమయంలోనే విజయవంతంగా పూర్తి చేసిన బోర్డును ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా అభినందించారు. ఈ మేరకు సోమవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తి పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించి, ఎప్పటికప్పుడు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తూ, ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటూ, అర్హులు ఉద్యోగ అవకాశాలు పొందేలా చేయడం గొప్ప విషయమని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంపికైన వైద్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో వైద్యవిద్య అవకాశాలు పెరిగి, సూపర్ స్పెషాలిటీ సేవలు మారుమూల ప్రాంతానికి సైతం చేరువ అయ్యాయని మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలో అవసరమైన వైద్య సిబ్బంది భర్తీని ప్రభుత్వం ప్రారంభించి, విజయవంతంగా పూర్తి చేస్తున్నట్టు చెప్పారు. ఒకవైపు వైద్యుల భర్తీతో పాటు, మరోవైపు 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీని మొదలు పెట్టినట్టు వివరించారు. అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా స్టాఫ్ నర్సు నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆన్ లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెండు వారాల్లోగా కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసి, నియామక ఉత్వర్వులు అందించి, విధుల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డిని ఆదేశించారు.