Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)ను విధుల్లో చేరకుంటే తొలగిస్తామనడం సరైంది కాదని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) విమర్శించింది. వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 11 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం సోమయ్య, టి లింగారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించకుండా, విధులలో వెంటనే చేరకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామనడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఆ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వారు నియామకమై నాలుగేండ్లు గడిచిపోయినప్పటికీ క్రమబద్ధీకరించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. వారిపై బెదిరింపు చర్యలు మానుకుని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.