Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీడబ్ల్యూసీకి ఈఎన్సీ లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
పోలవరంపై బ్యాక్‌వాటర్స్ ప్రభావంపై సంయుక్త సర్వే చేపట్టాలని రాష్ట్ర సాగునీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ కేంద్ర జల సంఘం చైర్మెన్‌కు(సీడబ్ల్యూసీ) ప్రత్యేకంగా లేఖ రాశారు. సర్వే చేయడానికి గతంలో ఒప్పుకున్న ఏపీ సర్కారు, ఇప్పుడు జాప్యం చేస్తున్నదని ఫిర్యాదు చేశారు. సర్వే విషయమై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)సైతం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. ఆలస్యం మూలంగా నష్టం జరుగుతుందని గుర్తుచేశారు. సమాచారం అడిగినా ఇవ్వడం లేదని సీడబ్ల్యూసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. 25 రోజుల్లో సంయుక్త సర్వే చేయకపోతే వర్షాకాలం ప్రారంభమవుతుందనీ, ఆ నేపథ్యంలో సర్వే చేయడానికి అనేక ఆటంకాలు ఎదురవుతాయని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయించిన గడువులోగా సర్వే జరిగేలా చూడాలని కోరారు. క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకునేలా తక్షణమే ఉమ్మడి సర్వే ప్రారంభించిలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత కృష్ణాబోర్డు భేటీలో ఏపీ సర్కారు సర్వే చేయడానికి అంగీకరించి ఇప్పుడు తీవ్ర ఆలస్యం చేయడాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు మూడు పేజీల లేఖను ఈఎన్సీ సి.మురళీధర్ సోమవారం సీడబ్ల్యూసీకి రాశారు.
10న కృష్ణాబోర్డు భేటి
కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం ఈనెల 10న హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనుంది. ఈమేరకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. ఏపీతో ఉన్న వివాదాలు, ఇతర నీటి కేటాయింపులపై ఇందులో చర్చించనున్నారు.