Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేపీఎస్‌లకు రాష్ట్ర సర్కారు అల్టిమేటం
- నేటి సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం
- నోటీసులు జారీ చేసిన సందీప్‌కుమార్ సుల్తానియా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అగ్రిమెంట్ బాండ్‌ను ఉల్లంఘిస్తూ యూనియన్‌గా ఏర్పడి, తమ సర్వీసు డిమాండ్‌తో ఏప్రిల్ 28 నుంచి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు(జేపీఎస్‌లు) సమ్మెలోకి వెళ్లడం చట్టవిరుద్ధమనీ, విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తీసేస్తామని రాష్ట్ర సర్కారు హెచ్చరించింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకల్లా విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. సోమవారం ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నోటీసులను జారీ చేశారు. 'జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలను ఉల్లంఘించడమే. జేపీఎస్‌లు యూనియన్ ఏర్పాటు చేయడం, సమ్మెకు దిగడం చట్టవిరుద్ధం. ప్రభుత్వంతో జేపీఎస్‌లు చేసుకున్న అగ్రిమెంట్ బాండ్‌ను ఉల్లంఘిస్తూ యూనియన్‌గా ఏర్పడి, తమ సర్వీసు డిమాండ్‌తో 2023 ఏప్రిల్ 28 నుండి సమ్మెకు దిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. 'జూనియర్ పంచాయితీ సెక్రటరీగా విధుల్లో చేరే ముందు సంఘాలు, యూనియన్లలో చేరబోం అని ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. దాని ప్రకారం వారికి ఆందోళన చేసే, సమ్మెకు దిగే హక్కు లేదు. ఈ వాస్తవాలు తెలిసినప్పటికీ, జేపీఎస్‌లు ఒక యూనియన్‌గా ఏర్పడ్డారు. చట్టవిరుద్ధంగా ఏప్రిల్ 28, 2023 నుంచి సమ్మెలోకి వెళ్ళారు. నిబంధనలు అతిక్రమించిన నేపథ్యంలో ఉద్యోగాలలో కొనసాగే హక్కును ఇప్పటికే వారు కోల్పోయారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో జేపీఎస్‌లకు చివరి అవకాశాన్ని ఇస్తున్నది. మే 9న సాయంత్రం ఐదు గంటల్లోపు విధుల్లో చేరాలి. విధుల్లో చేరని జూనియర్ పంచాయతీ కార్యదర్శులందరూ టర్మినేట్ అవుతారు' అని నోటీసులో పేర్కొన్నారు.
రెగ్యులర్ ఉద్యోగులుగా
గుర్తించనందుకే సమ్మెలోకి...
రాష్ట్ర ప్రభుత్వం 2019లో రిక్రూట్మెంట్ టెస్టు ద్వారా 9,355 పంచాయతీరాజ్ జూనియర్ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసింది. మూడేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఒప్పందం మీద 2019 ఏప్రిల్ 12 నుంచి జేపీఎస్‌లు విధులు చేపట్టారు. ఆ తర్వాత నాలుగేండ్లకు పెంచింది. అన్ని శాఖల ఉద్యోగులకు రెండేండ్లు ఉంటే వీరికి నాలుగేండ్లకు పెంచడమేంటనే విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. అయినా, రాష్ట్ర సర్కారు వెనక్కి తగ్గలేదు. గొడ్డుచాకిరీ చేయలేక, మూడు, నాలుగు నెలలకోసారి వేతనాలు ఇవ్వటం, వేరే ఉద్యోగాలు రావటం వంటి కారణాలతో చాలామంది జేపీఎస్ కొలువును వదిలేసిపోయారు. వారి స్థానంలో ఎంట్రెన్స్ టెస్టు మెరిట్ లిస్టు ప్రకారం ఔట్సోర్సింగ్ పద్ధతిలో జేపీఎస్‌లను నియమించారు. వీరి బతుకులు మరీ దారుణంగా ఉన్నాయి. నాలుగేండ్ల పూర్తయినా పర్మినెంట్ చేయకపోవడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఏప్రిల్ 28వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లారు.
స్పష్టమైన హామీ ఇవ్వరు..సమ్మె చేయొద్దంటరు...
సమ్మెకు వెళ్లేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును జూనియర్ పంచాయతీ కార్యదర్శులందరూ కలిశారు. ఆ సందర్భంగా మంత్రి వారికి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ దగ్గర ఫైలు ఉంది కాబట్టి తొందరపడి సమ్మెలోకి వెళ్లొద్దంటూ ఆయన వారికి సూచించారు.
ఇప్పటికే ఏ ప్రభుత్వ ఉద్యోగికి జరగని అన్యాయం తమకు జరుగుతున్నదనీ, ఇంకా నాన్చొద్దని జేపీఎస్‌లు మంత్రి దగ్గర గోసను వెళ్లబుచ్చుకున్నారు. తమను ఎప్పటిలోగా పర్మినెంట్ చేస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు అడిగారు. ఫైలు సీఎం దగ్గర ఉంది కాబట్టి తానేం చెప్పలేననీ, పర్మినెంట్ చేస్తారు కాబట్టి సమ్మెలోకి వెళ్లొద్దని ఎర్రబెల్లి అల్టిమేటం జారీ చేశారు. మంత్రి దగ్గర నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో అనివార్యంగా 28 నుంచి జేపీఎస్‌లు సమ్మెలోకి వెళ్లారు. మంత్రి చెప్పాడు కాబట్టి సమ్మెలోకి వెళ్లొద్దని కొందరు...లేదులేదు సమ్మెలోకి వెళ్లాల్సిందేనని జేపీఎస్‌ల యూనియన్ రెండుగా చీలిపోయింది. ఎక్కువ సంఖ్యలో జేపీఎస్‌లు సమ్మెలోకి వెళ్లారు. తాజాగా మూడు రోజుల కిందట కూడా మంత్రి దయాకర్‌రావు వారిని పిలిపించుకుని సమ్మె విరమించాలని సూచించారు. నిర్ధిష్టమైన హామీ ఇచ్చే వరకు తమ సమ్మె కొనసాగుతుందని జేపీఎస్‌లు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని అల్టిమేటం జారీ చేసింది.