Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూటీఎస్ నేతలకు మంత్రి సబిత హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వారం రోజుల్లో మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను విడుదల చేస్తామంటూ పీఆర్టీయూటీఎస్ నేతలకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రిని పీఆర్టీయూ టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు గత పదేండ్లుగా బదిలీలు, పదోన్నతులు కల్పించకపోవడం వల్ల విద్యార్థులు, టీచర్లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వారికి బదిలీలు, పదోన్నతులు కల్పించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. వారం రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యేలా మార్గదర్శకాలను రూపొందించాలంటూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను ఆదేశించారని తెలిపారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని, ఇందుకు తగిన సాఫ్ట్వేర్ను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఎంపీఏ రాష్ట్ర అధ్యక్షులు తరాల జగదీశ్, పీఆర్టీయూటీఎస్ నాయకులు అమర్నాథ్రెడ్డి, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.