Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
తెలంగాణకు చెందిన 72 మంది విద్యార్థులు మణిపూర్ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం చేరుకున్నారు. వారికి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ. ప్రకాష్ గౌడ్, అడిషనల్ డీజీపీలు మహేష్ భగవత్, అభిలాష బిస్త్, డీఐజీ బి.సుమతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్ తదితర అధికారులు స్వాగతం పలికారు.
మణిపూర్లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా స్వరాష్ట్రానికి తరలించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మణిపూర్ అధికారులతో చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ అంజనీకుమార్ సంప్రదింపులు జరిపారు. మణిపూర్ నుంచి తెలంగాణ విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. తెలంగాణకు చెందిన మొత్తం 130 మంది విద్యార్థుల్లో 72 మంది రాష్ట్రానికి తిరిగి రాగా మిగిలిన విద్యార్థులు మంగళవారం తెల్లవారు జామున హైదరాబాద్కు చేరుకుంటారని అధికారులు తెలిపారు. సీఎం కేసీఆర్ సకాలంలో స్పందించి విద్యార్థులను స్వస్థలానికి తీసుకురావడం పట్ల మణిపూర్ నుంచి వచ్చిన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టు నుంచి స్వస్థలాలకు చేరుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శంషాబాద్ మండల అధ్యక్షులు కే.చంద్రారెడ్డి, చిన్న గోల్కొండ పీఏసీఎస్ చైర్మన్ బొమ్మ దవణాకర్ గౌడ్ పాల్గొన్నారు.