Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనిల్‌కుమార్ ఇంటిపై దాక్కున్న దుండగులు
- సీపీఐ(ఎం) నేతల ఫిర్యాదుతో 19 మంది అరెస్టు
- పోలీసుల సోదాలో బయటపడిన తుపాకీ, బీజేపీ జెండాలు
నవతెలంగాణ - చిలమత్తూరు(బాగేపల్లి నుంచి)
కర్నాటక ఎన్నికల్లో బాగేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ(ఎం) తరఫున పోటీ చేస్తోన్న డాక్టర్ అనిల్కుమార్ని హత్య చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ గూండాలు మాటువేశారు. సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తల అప్రమత్తతో వారి ఎత్తులు సాగలేదు. బాగేపల్లి సీపీఐ(ఎం) అభ్యర్థి డాక్టర్ అనిల్‌కుమార్ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాదం, ప్రజల ఇబ్బందులపై విస్తృతంగా ప్రసంగిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో తెచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా అప్పట్లో పోరాడారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారు. ఏ ప్రాంతానికి వెళ్లినా బ్రహ్మరథం పడుతుండడంతో ఈసారి బాగేపల్లిలో సీపీఐ(ఎం) గెలుపు ఖాయం అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో, సీపీఐ(ఎం) అభ్యర్థిని హత్య చేసేందుకు ఆ రాష్ట్ర అధికార బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు కుట్రలు చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఇటీవల కొందరు గూండాలు అనిల్‌కుమార్ ఇంటిపై ఒక గదిలో మకాం వేశారు. ఆదివారం రాత్రి వారంతా 15 నిమిషాలకు ఒకసారి కిందకు రావడం, అనిల్‌కుమార్ ఇంట్లోకి తొంగిచూసి వెళ్లడం చేశారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అనిల్‌కుమార్ ఇంట్లో ఆదివారం రాత్రి పెద్ద సంఖ్యలో సీపీఐ(ఎం) కార్యకర్తలు ఉన్నారు. దీంతో, వారు ఇంట్లోకి చొరబడలేకపోయారు. వారిపై అనుమానం వచ్చిన కొందరు సీపీఐ(ఎం) నాయకులు సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. పోలీసులు వచ్చి అక్కడ అనుమానాస్పదంగా ఉన్న యువకులను విచారించారు. ఈ సమయంలో వారంతా మద్యం మత్తులో ఉండడం, పొంతనలేని సమాధానం చెప్పడంతో వారిని అరెస్టు చేశారు. వారి బ్యాగులను పరిశీలించగా తుపాకీ బయటపడింది. వారు వాడిన వాహనాల్లో బీజేపీ కండువాలు ఉన్నాయి. తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకొని 19 మంది అనుమానితులను అరెస్టు చేశారు. మరో 11 మంది పరారయ్యారని సీపీఐ(ఎం) నాయకులు తెలిపారు. బీజేపీకి అనుబంధంగా ఉన్న వారంతా అనిల్‌కుమార్‌ను హత్య చేసేందుకు పధకం పన్నారని చెప్పారు. సీపీఐ(ఎం) అభ్యర్థికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అర్ధరాత్రి బాగేపల్లి పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.
ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి : సీపీఐ(ఎం) అభ్యర్థి
అనిల్‌కుమార్‌పై హత్య కుట్ర తెలుసుకున్న సీపీఐ(ఎం) కార్యకర్తలు బాగేపల్లిలోని ఆయన నివాసం వద్దకు బాగేపల్లి, గుడిబండ, చేళూరు తాలుకాల నుంచి సోమవారం పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా వారితో అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఈ ఘటనతో కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, ఇలాంటప్పుడు సంయమనంతో ఉండాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరూ రావొద్దని కోరారు. హత్యా రాజకీయాలకు, దాడులకు పాల్పడే వారికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలన్నారు.
ఆర్ఎస్ఎస్ గూండాల నుంచి అనిల్‌కు రక్షణ కల్పించాలి .. : సీపీఐ(ఎం) చిక్‌బళ్లాపుర్ జిల్లా కార్యదర్శి మునివెంకటప్ప
బాగేపల్లిలో సీపీఐ(ఎం)కు పెరిగిన జనాదరణ చూసి ఓర్వలేని బీజేపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని సీపీఐ(ఎం) చిక్‌బళ్లాపుర్ జిల్లా కార్యదర్శి మునివెంకటప్ప విమర్శించారు. సీపీఐ(ఎం) అభ్యర్థి అనిల్‌కుమార్‌కు ప్రాణహాని ఉందని తెలిపారు.
ఈ కుట్రలో పట్టుబడింది కొంతమంది మాత్రమేనన్నారు. ప్రశాంతంగా ఉన్న బాగేపల్లిని మరో బెంగళూరు చేసేందుకు బిజెపి కుట్రపన్నుతోందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు, ఎన్నికల వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని కోరారు. బాగేపల్లిలో ఎగిరేది ఎర్రజెండానేనని తెలిపారు.
దాడిని తీవ్రంగా ఖండించిన సీపీఐ(ఎం)
- సమగ్ర విచారణకు డిమాండ్
- నిరసనలకు పిలుపు
బెంగళూరు : కర్నాటకలోని బాగెపల్లి సీపీఐ(ఎం) అభ్యర్థి అనిల్ కుమార్‌పై దాడిని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. దాడికి సంబంధించిన సమగ్ర దర్యాప్తునకు పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) తన అధికారిక ట్విట్టర్ వేదికగా స్పందించింది. కామ్రెడ్ అనిల్ కుమార్, సీపీఐ(ఎం)కు భద్రత కల్పించాల్సిన అవసరమున్నదని పేర్కొన్నది. ఈ మేరకు నిరసనలు నిర్వహించాలని రాష్ట్రంలోని తన అన్ని యూనిట్లకూ పార్టీ పిలుపునిచ్చింది.