Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడేషన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. తాత్కాలిక బుకింగ్ కార్యాలయం, రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) భవన నిర్మాణానికి సంబంధించిన ప్రధాన పనుల్లో వేగం పెరిగింది. అప్‌గ్రేడేషన్ పనులు దశలవారీగా చేపట్టి, ప్రణాళిక, షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే సోమవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే భూసార పరీక్ష, టోపోగ్రాఫిక్ సర్వే పూర్తి చేశారు. మే నెలాఖరు నాటికి తాత్కాలిక బుకింగ్ కార్యాలయ నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఆర్పీఎఫ్ భవన నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్టేషన్ భవనానికి దక్షిణం వైపున కొత్త స్టేషన్ భవనం త్వరలో అందుబాటులోకి వస్తుంది. అటు నుంచి వచ్చే ప్రయాణికులకు అండర్‌గ్రౌండ్ పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి.
అలాగే 11 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో భూగర్భ ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 9.5 లక్షల లీటర్ల భూగర్భ ట్యాంకులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. నిర్ణీత గడువులోపు స్టేషన్ నిర్మాణ పనులు పూర్తిచేసి, ప్రయాణీకులకు అందుబాటులోకి తెస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. రూ.700 కోట్ల వ్యయంతో స్టేషన్ అప్‌గ్రేడేషన్ పనులు చేపట్టామనీ, ప్రాజెక్ట్‌లోని ప్రతి దశను అధికారులు పర్యవేక్షిస్తున్నారని వివరించారు.