Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థులు
- కార్పొరేట్ కాలేజీల కంటే మెరుగైన ఫలితాలు
- ప్రయివేటు కళాశాలల్లో 63 శాతం ఉత్తీర్ణత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ వార్షిక ఫలితాల్లో గురుకుల విద్యాలయాల సొసైటీలు సత్తాచాటాయి. ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల కంటే మెరుగైన ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించాయి. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు (టీఎస్ఆర్జేసీ) అన్నింటి కంటే ఉత్తమ ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 92 శాతం ఉత్తీర్ణతను టీఎస్ఆర్జేసీ కాలేజీలు నమోదు చేశాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 89 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీసీ గురుకుల విద్యాలయాలు ద్వితీయ సంవత్సరంలో 87 శాతం ఉత్తీర్ణతను సాధించాయి.
గిరిజన గురుకులాలు ద్వితీయ సంవత్సరంలో 84 శాతం, మైనార్టీ గురుకులాలు 83 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. తెలంగాణ ప్రభుత్వ స్పోర్ట్స్ జూనియర్ కాలేజీలు 75 శాతం, కేంద్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 72 శాతం ఉత్తీర్ణతను పొందాయి. ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 46 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రయివేటు జూనియర్ కాలేజీల్లో ద్వితీయ సంవత్సరంలో 63 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మాత్రం అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణతను సాధించలేదు. ద్వితీయ సంవత్సరంలో కేవలం 54 శాతం ఉత్తీర్ణత సాధించాయి. గురుకులాల తరహాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. జూనియర్ కాలేజీల్లోని అధ్యాపకులు మరింత కష్టపడి పనిచేయాలని, మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని కోరారు.