Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్‌కు గిరిజన సంఘాల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన బెస్ట్ అవైలబుల్ పథకంలో సీట్ల సంఖ్యను పెంచాలని తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ గిరిజన సమాఖ్య సంయుక్తంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు ఆయా సంఘాల నేతలు ఆర్ శ్రీరాంనాయక్, ఆర్ అంజయ్య నాయక్ వినతి పత్రం అందజేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పేద గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలల్లో ఉచితంగా విద్యనందేంచేందుకు వీలుగా ప్రవేశపెట్టిన గిరిజన బెస్ట్ అవైలబుల్ పథకంలో 2000 సీట్లను అదనంగా పెంచాలని ,అందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చే విధంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గత రెండు మూడేండ్ల నుంచి గిరిజన గురుకులాల్లో సీట్లకోసం 21 వేల మందికి పైగా గిరిజన విద్యార్థులు దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు. కానీ 9 నుంచి 10వేల మంది మాత్రమే లాటరీల ద్వారా సీట్లు పొందుతున్నారని వివరించారు. మిగిలిన వారు వివిధ ప్రయివేటు విద్యాసంస్థల్లో అనివార్యంగా చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని తెలిపారు.
2002 నుంచి విద్యార్థులకు కార్పొరేట్ ప్రయివేటు పాఠశాలల్లో ఉచితంగా విద్యను అందిచడానికి ఆనాటి ప్రభుత్వం గిరిజన బెస్ట్ అవైలబుల్ పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటివరకు 6వేల సీట్ల వరకే ప్రయివేటు పాఠశాలల్లో సీట్లు పొందే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ స్కీములో ఒక్క సీటు కూడా పెంచలేదని గుర్తుచేశారు. ప్రతి ఏడాది ఈ పథకంలో సీట్లు కావాలని 15వేల మంది వరకు విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు. కానీ ప్రతి ఏటా పదో తరగతి పూర్తయిన విద్యార్థుల ఖాళీ సీట్లను భర్తీ చేస్తున్నదని వివరించారు. ఈ క్రమంలో దరఖాస్తులకు, పథకంలో ఉన్న సీట్ల ఏమాత్రం సరిపోవడం లేదని తెలిపారు. అదనంగా మరో 2 వేల సీట్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన సంక్షేమ శాఖ కూడా 2000 సీట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆర్థిక శాఖకు పైలు పంపి సాంఘిక సంక్షేమ శాఖలో 3000 సీట్ల పెంచుకోవటానికి ఆ శాఖకు గతేడాది ఆగమేఘాలమీద అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చిన సీట్ల పెంపు ప్రతిపాదనకు మాత్రం అనుమతించారని వాపోయారు. ఈ నేపథ్యంలో ప్రణాళికా సంఘం జోక్యం చేసుకుని పేద గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామంటూ వినోద్‌కుమార్ ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్టు సంఘాల నేతలు పేర్కొన్నారు.