Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3.20 లక్షల మంది దరఖాస్తు
- 137 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ఆన్లైన్లో రాతపరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పకడ్బందీగా ఈ పరీక్షలను నిర్వహించడం కోసం అధికారులు సర్వంసిద్ధం చేశారు. ఈనెల 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం, 12 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం రాతపరీక్షలను నిర్వహిస్తారు. రోజూ రెండో విడతల్లో పరీక్షలుంటాయి. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటలకు రెండో విడత పరీక్షలు జరుగుతాయి. మొదటి విడతకు ఉదయం 7.30 నుంచి తొమ్మిది గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతి ఉంటుంది. రెండో విడతకు మధ్యాహ్నం 1.30 నుంచి మూడు గంటల వరకు అనుమతిస్తారు.
సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతిని నిరాకరిస్తారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌పై ఉన్న నియమ, నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తెచ్చుకోవాలి. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణలో 104, ఏపీలో 33 కలిపి మొత్తం 137 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ విభాగానికి 2,05,405 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 1,15,361 మంది కలిపి మొత్తం 3,20,766 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇంజినీరింగ్‌కు తెలంగాణ నుంచి 1,53,935 మంది, ఏపీ నుంచి 51,470 మంది అభ్యర్థులు, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి తెలంగాణ నుంచి 94,614 మంది, ఏపీ నుంచి 20,747 మంది దరఖాస్తు చేశారు. ఈ ఏడాది ఫ్లైయింగ్ స్క్వాడ్ల స్థానంలో ఈసారి సిట్టింగ్ అబ్జర్వర్లను ప్రతి కేంద్రంలో నియమిస్తారు. వారే పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని రకాల పనులనూ పర్యవేక్షిస్తారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచుతారు.