Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో మరోసారి ఉగ్రవాదుల కదలికలు తేలాయి. హైదరాబాద్ నగరంలోనే మకాం వేసిన ఐదుగురు ఉగ్రవాదులను మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ప్రత్యేక టీమ్ అరెస్టు చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హిజ్ ఉజ్ తంజమిన్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన కొందరు ఉగ్రవాదులు హైదరాబాద్‌లో మకాం వేసినట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు మొదట సమాచారం అందింది. అప్పటికే ఈ సంస్థకు చెందిన వారు మద్యప్రదేశ్‌లో కూడా తమ రహస్య కార్యకలాపాలను సాగిస్తున్నట్టు ఐబీ సమాచారం. దీని ఆధారంగా రంగంలోకి దిగిన మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు అక్కడ 11 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారి విచారణలో హైదరాబాద్‌లో కూడా మారు పేర్లతో మకాం వేసిన మరి కొందరు ఉగ్రవాదుల గురించిన సమాచారం బయటపడింది. దీంతో గత మూడు రోజులుగా మకాం వేసిన ఏటీఎస్ పోలీసులు రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల సహకారంతో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను అత్యంత రహస్యంగా చేపట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఐగుదురు ఉగ్రవాదులను ప్రత్యేక టీమ్ అధికారులు పట్టుకున్నారు.