Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెలికం సంస్థలకు సీఎస్ హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో ఎలాంటి తవ్వకాలు జరిగినా ప్రభుత్వానికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. మంగళవారంనాడామె అధ్యక్షతన స్టేట్ బ్రాడ్‌బ్యాండ్ కమిటీ సమావేశం జరిగింది. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాస్ రాజు, పీఆర్ అండ్ ఆర్డీ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, బీఎస్ఎన్ఎల్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టెలికాం సూచికల్లో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందుందని చెప్పారు. 3.5 కోట్ల జనాభాకు నాలుగు కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లతో టెలి-సాంద్రత (107శాతం) ఉందన్నారు. 97.7 శాతం గ్రామాలు మొబైల్ కనెక్టివిటీతో ఉన్నాయనీ, దేశంలో 5జీని ప్రారంభించిన అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉన్నదని వివరించారు. 5జీ సేవలను వేగవంతం చేసేందుకు వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఏ రకమైన తవ్వకాలనైనా ప్రారంభించేందుకు 'కాల్ బిఫోర్ యు డిగ్' (సీబీయుడీ) యాప్ ద్వారా ముందస్తు సమాచారం అందించిన తర్వాతే తవ్వకాలు చేయాలని తేల్చిచెప్పారు.
ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాలు ముందుగా యాప్‌ను ఉపయోగించేలా అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.