Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీజు చెల్లించిన కళాశాలలు 1,531
- త్వరలోనే అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి
- ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,036 జూనియర్ కాలేజీలకే అనుబంధ గుర్తింపు లభించింది. అందులో ప్రభుత్వ ఆధ్వర్యంలోని జూనియర్ కాలేజీలే ఉన్నట్టు తెలుస్తున్నది. ఉదాహరణకు గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లున్నాయి. జూనియర్ కాలేజీల నుంచి ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించారు. వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు. 1,531 జూనియర్ కాలేజీలు ఫీజును చెల్లించాయి. డీఐఈవోలు, ఇంటర్ బోర్డులో ఆ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఇంటర్ పరీక్షలు ఆ తర్వాత ఫలితాల విడుదలపైనే అధికారులు దృష్టి కేంద్రీకరించారు. అందుకే అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఆలస్యమైంది. రాష్ట్రంలో మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉండే జూనియర్ కాలేజీల పట్ల ఇంటర్ బోర్డు కఠినంగా వ్యవహరిస్తున్నది. 2023-24లో ప్రవేశాలు పొందే సమయంలోనే విద్యార్థుల నుంచి డిక్లరేషన్ పొందాలని ఆంక్షలు విధిస్తున్నది. మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్నందున 2024-25 విద్యాసంవత్సరంలో ఆ కాలేజీకి గుర్తింపు రాకుంటే వేరే కాలేజీలో చదివేందుకు ఇష్టమే అంటూ విద్యార్థులు అంగీకరించాల్సి ఉంటుంది. ఇంకోవైపు ఆ కాలేజీ మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉందన్న వాస్తవం విద్యార్థులకు తెలియడం కోసమే ఈ నిర్ణయాన్ని అధికారులు తీసుకున్నట్టు సమాచారం. మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉండే కాలేజీలకు ఫైర్ ఎన్వోసీ తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. అయితే హోం శాఖ నిబంధనలు కఠినంగా ఉన్నందున ఆ ఎన్వోసీ కాలేజీలకు రావడం లేదు. దీంతో ఏటా ఆయా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ఫైర్ ఎన్వోసీ నుంచి సడలింపునివ్వడం షరామామూలుగా జరుగుతున్నది. వచ్చే విద్యాసంవత్సరం వరకు మిక్స్డ్ ఆక్యుపెన్సీలోని కాలేజీలకు ప్రభుత్వం సడలింపునిచ్చింది. కానీ 2024-25 విద్యాసంవత్సరంలో ఆ కాలేజీల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారనుంది. అందుకే ఇంటర్ బోర్డు వచ్చే విద్యాసంవత్సరంలో చేరే విద్యార్థుల నుంచి డిక్లరేషన్ను తీసుకోవాలని నిర్ణయించింది. జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ మంగళవారం తనను కలిసిన విలేకర్లతో చెప్పారు. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించామని, వాటిని పరిశీలించి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామని వివరించారు.