Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీట్, జేఈఈ, ఎంసెట్ ర్యాంకుల ప్రచారానికీ అవసరమే
- నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తాం
- కార్పొరేట్ కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ప్రకటన ఇవ్వాలంటే ఇంటర్ బోర్డు అనుమతి పొందడం తప్పనిసరి. ఆ తర్వాతే ఆ ప్రకటనను మీడియా సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలిస్తే జరిమానా విధిస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. ఆ ప్రకటనలకు ఎంత ఖర్చు అవుతుందో అంతే డబ్బును ఇంటర్ బోర్డుకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రకటనను ఖండిస్తూ ఇంటర్ బోర్డు మీడియాకు ఇచ్చే ప్రకటనకు అయ్యే ఖర్చును కూడా ఆయా కాలేజీల యాజమాన్యాలే భరించాల్సి ఉంటుందని బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ మంగళవారం తనను కలిసిన విలేకర్లతో చెప్పారు. ఇంటర్మీడియెట్ మార్కులే కాకుండా జూనియర్ కాలేజీ పేరుతో ఇచ్చే ఏ ప్రకటన అయినా బోర్డు అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. నీట్, జేఈఈ, ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో సాధించిన ర్యాంకుల ప్రచారానికీ అనుమతి తీసుకోవాలని అన్నారు. మీడియాలో వచ్చే ప్రకటనలను పర్యవేక్షించడం కోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రకటనలపై నిఘా పెంచేందుకు ఐదుగురితో కమిటీని నియమించామని వివరించారు. తప్పుడు పద్ధతుల్లో మోసపూరిత ప్రకటనల ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులను మభ్యపెట్టే విధానానికి స్వస్తి పలుకుతామని చెప్పారు. అయితే కాలేజీలు ఇచ్చే ప్రకటనలను తాము నియంత్రించబోమని, ఆ ప్రకటనలో ఉండే తప్పుడు సమాచారాన్ని మాత్రమే పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.