Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో జూనియర్ పంచాయితీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వారి సమస్యలను పరిష్కారించా లంటూ మంగళవారం సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలంటూ జీపీఎస్‌లు గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ఎంత సేపు రాజకీయాలే తప్ప జూనియర్ పంచాయితీ కార్యదర్శుల గోసను పట్టించుకునే సోయి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే మన పంచాయితీలు ఆదర్శమనీ, అందుకే కేంద్రం అవార్డులు ఇస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నదని ఎద్దేవా చేశారు. పగలనకా, రాత్రనకా కుటుంబాలను సైతం పట్టించుకోకుండా పంచాయతీ కార్యదర్శులు పడిన శ్రమతోనే అవార్డులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇంత చేసి అవార్డులు తెస్తే వారి సర్వీసులను రెగ్యులర్ చేయకుండా వేధించడం ఎంత వరకు సహేతుక మని ప్రశ్నించారు. వారి కష్టానికి ప్రభుత్వం ఇచ్చే రివార్డు ఇదేనా? అని ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరీ మూడేండ్ల సమయం 2022, ఏప్రిల్ 11న పూర్తయిందని తెలిపారు. ప్రొబేషన్ పీరియడ్ తర్వాత జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తానమంటూ సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను సావధానంగా విని పరిష్కరించాల్సిన ప్రభుత్వం... సమ్మె విరమించి, విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు తొలగిస్తామంటూ హెచ్చరించమేంటని ప్రశ్నిం చారు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థానంలో నిలవాలనే ఆశ ఉన్నప్పటికీ తక్కువ జీతమే అయినా ప్రభుత్వ ఉద్యోగావకాశాన్ని వదలుకోకూడదనే లక్ష్యంతోనే అనేక మంది జీపీఎస్‌లు ఉద్యోగాల్లో చేరారని గుర్తు చేశారు. ఎంతో పనిభారం పెరిగినా, భరిస్తూ రెగ్యులర్ చేస్తారనే ఆశతో ఎదురు చూశారని తెలిపారు. మూడేండ్ల ప్రొబేషన్ ముగిసినా... మరో ఏడాది పొడిగించిన అలస్యంగానైనా న్యాయం జరుగుతుందనే సదుద్దేశంతో దానికి కూడా అంగీకరించి తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించారని తెలిపారు. ఇప్పుడు నాలుగేండ్ల ప్రొబేషన్ పీరియడ్ ముగిసినా ఉద్యోగాలను రెగ్యులర్ చేయకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా పంచా యితీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాల్సిన బాధ్యత సీఎంపై ఉందని పేర్కొన్నారు. లేదంటే వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడమే కాక...ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతామని రేవంత్ హెచ్చరించారు.