Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షలంటే మితిమీరిన భయమొద్దు
- ఆత్మహత్యలు పరిష్కారం కాదు: డాక్టర్ హిప్నో పద్మాకమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మనిషికి చదువే జీవితం కాదనీ, పరీక్షలంటే మితిమీరిన భయం పెట్టుకోవద్దని కౌన్సెలింగ్ సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్ డాక్టర్ హిప్నో పద్మాకమలాకర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యతిరేక ఆలోచనలు కలిగిన వారికి ప్రతిదీ పరీక్షలాగానే కనిపిస్తుందని తెలిపారు. ఆత్మహత్యలు ఏ సమస్యకూ పరిష్కారం కాదని స్పష్టం చేశారు. పరీక్షలు విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకే గానీ అవే సర్వస్వం కాదని ఆమె పేర్కొన్నారు. ఒకసారి మార్కులు తక్కువ వచ్చిన వారు మళ్లీ బాగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకునే పిల్లలు నిరాశలో ఉన్న సమయంలో తల్లిదండ్రులు వారిని గుర్తించి స్నేహపూర్వకంగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రేమతో మాట్లాడుతూ సైకాలజిస్టు వద్దకు తీసుకెళ్లాలని కోరారు. పరీక్ష తప్పితే లోపమెక్కడ ఉందో తెలుసుకుని మెరుగుపరుచుకుని విజయం సాధించేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఆనందాలకు దూరం చేస్తూ చదివే యంత్రాలుగా పిల్లలను మార్చవద్దని తల్లిదండ్రులకు ఆమె సూచించారు.