Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-హిమాయత్ నగర్
ఒలింపిక్, కామన్వెల్త్ గేమ్స్ పతకాలను సాధించి భారతదేశ కీర్తిపతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులు దేశానికే అవమానకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బ్రిజ్ భూషణ్ వంటి నిందితులను కాపాడుతూ, న్యాయం కోసం పోరాడుతున్న మహిళా క్రీడాకారిణులను అవమానపరుస్తూ బీజేపీ దేశం పరువు తీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లకు సంఘీభావంగా సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ మఖ్దూమ్ భవన్ నుంచి 'వై' జంక్షన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలతో బ్రిజ్ భూషణ్‌పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడితోనే ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్టు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపుల నిందితులను కాపాడటంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తుందన్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ.. మైనర్‌తోపాటు ఏడుగురు రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విషయంలో కేంద్ర నాయకత్వం ఎందుకు మౌనం పాటిస్తున్నదని ప్రశ్నించారు. బీజేపీ మౌనం 'మహిళా వ్యతిరేక' ముఖాన్ని బట్టబయలు చేసిందన్నారు. నేరాలు చేయడం, ముఠాలను నడిపించడం, హత్యలు, లైంగికదాడులు, దోపిడీలకు పాల్పడిన వారు ఎక్కువ మంది బీజేపీలో ప్రజాప్రతినిధులుగా ఉన్నారని విమర్శించారు.
సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ బ్రీజ్ భూషణ్‌కు మోడీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. దేశం మహిళా రెజ్లర్ల కన్నీళ్లను చూస్తోందని, దేశం బీజేపీని క్షమించదని అన్నారు. మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు సీపీఐ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి.నరసింహ, పశ్య పద్మ, విఎస్.బోస్, నగర కార్యదర్శి ఎస్.ఛాయాదేవి, టి.శ్రీనివాస్‌రావు, నాయకులు కలవేణి శంకర్, ఎన్.బాలమల్లేష్, ఏం.బాలనరసింహ, బి.హేమంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.