Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాప్రస్థానం కంటే అద్భుతంగా బేగంపేట శ్మశానవాటిక
- నగరంలో త్వరలో డబుల్ బెడ్రూమ్స్ పంపిణీ :కేటీఆర్
నవతెలంగాణ-బేగంపేట్
ఈ సంవత్సరం ఆగస్టు 31 నాటికి హైదరాబాద్ నగరంలో రూ.3866 కోట్లతో 31 సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ బేగంపేట డివిజన్లోని శ్మశానవాటిక జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం కంటే అద్భుతంగా ఉందన్నారు. బేగంపేటలో రూ.8.54 కోట్లతో నిర్మించిన శ్మశానవాటికను మంగళవారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బేగంపేట డివిజన్లోని ధనియాల గుట్టలో శ్మశాన వాటిక విషయంలో ఎమ్మెల్యే కృష్ణారావు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారని చెప్పారు. ఎల్బీనగర్లో మూడు మతాల వారికి ఒకే చోట తొమ్మిది ఎకరాల్లో శ్మశానవాటిక నిర్మించినట్టు చెప్పారు.నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను త్వరలో పంపిణీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. గతంలో వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు రూ.560 కోట్ల సహాయం చేసిందని చెప్పారు. కేంద్రం పైసా కూడా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టే విధంగా పని చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రూ.45 లక్షల విలువ గల రెండు అంతిమ యాత్ర వాహనాలను విరాళంగా అందజేసిన నర్సింహారెడ్డిని మంత్రి అభినందించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ధనియాలగుట్ట శ్మశానవాటిక వల్ల 20 బస్తీలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. కూకట్‌పల్లిలో రానున్న కాలంలో 54 గ్రేవ్ యార్డ్‌లను అభివృద్ధి చేసి ప్రజలకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపాల్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, సురేష్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.