Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు పీఆర్టీయూ తెలంగాణ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు చేపట్టడానికి చర్యలు వెంటనే తీసుకోవాలని పీఆర్టీయూ తెలంగాణ కోరింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్ బిక్షంగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. జీవో నెంబర్ ఐదు ప్రకారం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత కొందరు ఉపాధ్యాయులు ఆ మార్గదర్శకాలపై కోర్టుకు వెళ్లారని తెలిపారు. స్పౌజ్ పాయింట్లపైన, కొన్ని సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక పాయింట్లపైన న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. అంతే తప్ప పదోన్నతుల విషయం పైన ఎలాంటి అభ్యంతరం తెలుపలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విద్యా శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం ఒక్క పదోన్నతి కూడా ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 22 ఏండ్లుగా ఒకే క్యాడర్లో పనిచెయ్యడం విద్యా రంగ చరిత్రలో లేదని పేర్కొన్నారు. గతంలో ఇంతకన్నా జఠిలమైన సమస్యలున్నప్పుడు కూడా పదోన్నతులు కల్పించారని గుర్తు చేశారు. ప్రతినెలా పదోన్నతులు కూడా కల్పించారని తెలిపారు. వాస్తవానికి బదిలీలకు, పదోన్నతులకు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని విద్యాశాఖాధికారులు ఎందుకు గ్రహించడం లేదో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆలోచించి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. ఇప్పుడు చేపట్టకుంటే త్వరలో సాధారణ ఎన్నికలు వస్తాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా పదోన్నతులు కల్పించలేదన్న చరిత్ర మంచిది కాదని తెలిపారు.