Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దారిమళ్లిన లైంగిక దాడి బాధితుల నష్టపరిహర డబ్బులు..
- వాటిని తక్షణం విడుదల చేయాలి..లేదంటే ఉద్యమం..
- దళిత సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణా బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ ఎస్టీ లైంగిక దాడి బాధితులకోసం వినియోగించాల్సిన నిధులను దారిమళ్లించడం అత్యంత హేయమైన చర్యనీ, సమాజంలో వివిధ రూపాల్లో దాడులు, వివక్షను ఎదుర్కొంటున్న బాధితులపై ప్రభుత్వం మరో రకమైన వివక్ష చూపించటమంటే..చట్టాన్ని ఉల్లంఘించటమేనని పలువురు దళిత సంఘాల నేతలు విమర్శించారు.
బాధితులకు చెల్లించాల్సిన రూ.10 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించి, వారిని దగా చేయటం తగదని వారు హెచ్చరించారు. దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్), నేషనల్ అట్రాసిటిస్ ప్రివెన్షన్ ఫోర్స్ (ఎన్ఏపీఎఫ్), మాల సంక్షేమ సంఘం (ఎంఎస్ఎస్) అధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ లైంగిక దాడి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలనే రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాంప్రసాద్, శంకర్, శివలింగం, పులి కల్పన మాట్లాడుతూ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఫిబ్రవరిలో రూ.5 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు.ఆ మొత్తానికి మరో రూ.5 కోట్లను జమచేసి మొత్తం పది కోట్లకు బడ్జెట్ రిలిజ్ అర్డర్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల ఖాతాలకు డబ్బులు పంపి గంట వ్యవధిలోనే తిరిగి తీసుకుందని వాపోయారు. ఈ రకంగా బాధితులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 వేల మంది బాధితులకు నష్టపరిహారం చెల్లించలేదని చెప్పారు. వారికి అందించాల్సిన పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తక్షణ సహయం,నష్టపరిహారం,పునరావాసం భిక్ష కాదనీ, హక్కు అని చెప్పారు.పెండింగ్‌లో ఉన్న మొదటి, రెండు, మూడు దశల్లో చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని బాధితులకు అందించి పునరావాసం కల్పించాలన్నారు. బాధితుల నష్టపరిహారం నిధులను వెనక్కి తీసుకునే స్ధాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారడమేంటని ప్రశ్నించారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం ఎఫ్ఐఅర్ నమోదైన ఏడు రోజుల్లో మొదటి దశ నష్టపరిహరం చెల్లించాలనీ, ఛార్జీషీటు వేసిన తర్వాత రెండో దశ, నిందితులకు శిక్ష పడిన తర్వాత చివరి దశ నష్టపరిహరాన్ని చెల్లించి పునరవాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన్నే ఉందని తెలిపారు. కాచిగూడకు చెందిన బాధితురాలు సంధ్య మాట్లాడుతూ తన భర్త గణేష్ మరణించిన కేసులో జనవరిలో ప్రభుత్వం మొదటి దశగా రూ.25 వేల నష్టపరిహారం ఇస్తూ ప్రోసిడింగ్ ఇచ్చినప్పటికీ నేటికి పరిహారం అందలేదన్నారు. బషీర్‌బాగ్‌కు చెందిన ప్రవీణ్ మాట్లాడుతూ తనకు జనవరిలో ప్రోసిడింగ్ ఇచ్చినప్పటికీ పరిహారం అందలేదని చెప్పారు. లాలపేటకు చెందిన పద్మ మాట్లాడుతూ తన తమ్ముడు పాండును హత్య చేసి ఆరు నెల్లు గడుస్తున్నా న్యాయం జరగలేదని వివరించారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు డాక్టర్ నిమ్మ బాబురావు, శ్రీ కాంత్, దాసు తదితరులు పాల్గొన్నారు.