Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.సుధాకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయాలని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో బాగ్లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో బీఎన్ 15వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఎన్ చిత్రపటానికి ఆ పార్టీ సీనియర్ నాయకులు గాదె మల్లేశ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వనం సుధాకర్ మాట్లాడుతూ... తెలంగాణలో కుల మతాలకతీతంగా ప్రజలను సమీకరించి లక్షలాది ఎకరాలను పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదన్నారు. ఆ పోరాటంలో బీఎన్ తెలంగాణ చేగువేరాగా గుర్తింపు పొందారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, బీఎన్ లాంటి మహనీయుల చరిత్రను చెరిపివేసే కుట్రలకు పూనుకున్నదని విమర్శించారు. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.తుకారాం నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుకన్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర రాజేష్,ఇ. కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయ యోధుడు బీఎన్ : బీఎల్ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్
బీఎన్ సామాజిక న్యాయ యోధుడని బీఎల్ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్ కొనియాడారు. ఓంకార్ భవన్లో బీఎన్ వర్థంతిలో బీసీపీ రాష్ట్ర కార్యదర్శి కె.పర్వతాలుతో కలిసి ఆయన పాల్గొన్నారు. వారు బీఎన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. సమస్త ప్రజల సమానత్వాన్ని బీఎన్ కోరుకున్నారన్నారు.