Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెల క్రితం ఆత్మహత్య చేసుకున్న మరో విద్యార్థి ఏ గ్రేడ్‌లో పాస్..
నవతెలంగాణ-ఆర్మూర్ / మెడిపల్లి /కేసముద్రం రూరల్
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో మంగళవారం జరిగాయి. మరో ఘటనలో.. పరీక్షలు బాగా రాయలేదన్న కారణంతో గత నెల 10వ తేదీన మహబూబాబాద్‌కు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా, ఆ విద్యార్థి ఏ గ్రేడ్‌లో పాస్ అవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రినగర్‌కు చెందిన ప్రజ్వల్ (17) హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాగా మంగళవారం వెలువడిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ప్రజ్వల్ ఫెయిలయ్యాడు. దాంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి తండ్రి ఆర్ఎంపీ వైద్యుడు. ఎదిగిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన బొడ్డుపెళ్లి అభిషేక్ (17) జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్టేషన్ హౌసింగ్ అధికారి సుధీర్ రావు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పిక్లా తండా, బోడగుట్ట గ్రామ పంచాయతీకి చెందిన రైతు దంపతులు గుగులోతు లచ్చు, జ్యోతిక కుమారుడు గుగులోతు కృష్ణ(19) వరంగల్‌లోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్ చదివాడు. పరీక్షలు బాగా రాయలేదని, ఫెయిల్ అవుతానేమోననే భయంతో రిజల్ట్ రాకముందే గత నెల 10న సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కృష్ణ 1000 మార్కులకు గాను 892మార్కులు సాధించి ఏగ్రేడ్‌లో పాసయ్యాడు. దాంతో తల్లిదండ్రులు, అతని సోదరి.. 'అయ్యో బిడ్డా.. అనుమానంతో తనువు చాలిస్తివి... పరీక్షల్లో మంచి మార్కులు సాధించి.. జీవితంలో ఫెయిల్ అయితివి' అంటూ కన్నీరుమున్నీరయ్యారు. కాగా, కృష్ణ ఎంబీబీఎస్ చదవాలనుకున్న తాను.. ఆ స్థాయిలో తాను రాణించ లేక పోతున్నానని, ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో చనిపోతున్నానని, అమ్మనాన్నలు క్షమించడంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.