Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలి
- సమ్మెను విరమింపజేయాలి
- సీఎం కేసీఆర్కు జూలకంటి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 2019 ఏప్రిల్ నుంచి పనిచేస్తున్నారు. నోటిఫికేషన్ ప్రకారం ప్రొబేషన్ కాలం ఏప్రిల్ 2022కే పూర్తయ్యింది. అయినా మరొక్క సంవత్సరం పెంచుతూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఈ గడువు కూడా 11ఏప్రిల్ 2023తో ముగిసింది. తెలంగాణలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వ్యవస్థ ఉండకూడదన్న మీరు, నాలు గేండ్ల ప్రొబేషన్ గడువు పూర్తయినప్పటికీ రెగ్యులరైజ్ చేయకపోవడం బాధాకరం.వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. వాళ్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలి' అని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. లేఖలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రతి అభివద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో వివిధ గ్రామాలకు అనేక అవార్డులు కూడా తీసుకొచ్చారు. స్థానిక సంస్థల్లో వాళ్ల పాత్ర చాలా కీలకమైనది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన వాళ్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 11 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే, వారిని చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాల్సింది పోయి, కార్మికులనే విధుల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం బెదిరించడం అప్రజాస్వామికం.
- జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేస్తూ జీవోను విడుదల చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. నాలుగేండ్ల ప్రొబేషన్ కాలన్ని సర్వీసు కాలంగా గుర్తించాలి.
- ప్రస్తుతం పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులనందరినీ జేపీఎస్లుగా ప్రమోట్ చేస్తూ పని చేసిన కాలాన్ని ప్రొబేషన్ పీరియడ్లో భాగంగా పరిగణించాలి. రెగ్యులరైజ్ చేయాలి.
- రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ సంఖ్యను నిర్ధారించి ప్రకటించాలి.
- మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాల నుంచి కారుణ్య నియమకాలు చేపట్టాలి.
- అర్హులైన సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు కల్పించాలి.
- జీవో నంబర్ 317 వల్ల నష్టపోయిన పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేయాలి. పరస్పర బదిలీలు, స్పౌస్ బదిలీలకు అవకాశం కలిపించాలి.