Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది కంటే 3.4 శాతం తగ్గుదల ... బాలికలదే పైచేయి
- బాలుర కంటే 3.85 శాతం అధికంగా పాస్
- 6,163 మందికే పదికి పది సీజీపీఏ
- గతేడాది కంటే 5,180 మంది తక్కువ
- 2,793 పాఠశాలల్లో వందశాతం పాస్
- 25 బడుల్లో సున్నా ఫలితాలు
- అగ్రస్థానంలో నిర్మల్, అట్టడుగున వికారాబాద్
- ఫలితాలు విడుదలచేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలో బుధవారం విడుదల చేశారు. కరోనా సమయంలో 2020, 2021లో పదో తరగతి పరీక్షలను నిర్వహించలేదు. ఆ రెండేండ్లు విద్యార్థులందరినీ ప్రభుత్వం ఉత్తీర్ణులుగా ప్రకటించింది. గతేడాది 70 శాతం సిలబస్‌తో ఎక్కువ ఛాయిస్ ఇచ్చి పదో తరగతి పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వంద శాతం సిలబస్‌తో ఆరు పేపర్లకే ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ ఏడాది 86.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది కంటే ఇప్పుడు 3.4 శాతం ఉత్తీర్ణత తగ్గడం గమనార్హం. రెగ్యులర్ విద్యార్థులు 4,84,370 మంది పరీక్షలకు హాజరుకాగా, 4,19,460 (86.60 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలురు 2,43,186 మంది పరీక్షలు రాయగా, 2,05,930 (84.68 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. బాలికలు 2,41,184 మంది పరీక్షలకు హాజరైతే 2,13,530 (88.53 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు కంటే బాలికలు 3.85 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధిం చారు. ఈ ఏడాది 7,492 మంది విద్యార్థులు ప్రయివేటుగా పరీక్షలకు హాజరుకాగా, 3,335 (44.51 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఇందులో 5,162 మంది బాలురు హాజ రైతే 2,223 (43.06 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 2,330 మంది బాలికలు పరీక్ష రాస్తే, 1,112 (47.73 శాతం) మంది పాసయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఎ శ్రీదేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం రాధారెడ్డి, మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులు సిహెచ్ రమణకుమార్‌తోపాటు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు విజయభారతి, గంగిరెడ్డి పాల్గొన్నారు.
సర్కారు బడుల్లో 72.39 శాతం ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులకు సంబం ధించి 2,793 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. ఈసారి 25 పాఠశాలల్లో 'సున్నా' ఫలితాలొచ్చాయి. తెలంగాణ గురుకుల పాఠశాలలు 98.25 శాతంతో అత్యధిక ఉత్తీర్ణతను నమోదు చేశాయి. ప్రభుత్వ పాఠశాలలు 72.39 శాతంతో అత్యల్ప ఉత్తీర్ణతను సాధించాయి. తెలంగాణ గురుకుల, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్టీ గురుకులాలతోపాటు మోడల్ స్కూళ్లు, ప్రయివేటు పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత 86.60 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణతను నమోదు చేశాయి. కేజీబీవీ, ఎయిడెడ్, జిల్లా పరిషత్, ఆశ్రమ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత 86.60 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణతను సాధించాయి.
99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ ప్రథమం
పదో తరగతి ఫలితాల్లో 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 9,071 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 8,980 (99 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 4,442 మంది బాలురు పరీక్షలు రాస్తే 4,392 (98.87 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 4,629 మంది బాలికలు పరీక్షలకు హాజరైతే 4,588 (99.11 శాతం) మంది పాసయ్యారు. 98.65 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 14,177 మంది పరీక్షలు రాయగా, 13,985 (98.65 శాతం) మంది పాసయ్యారు. 97.29 శాతంతో సంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో ఉన్నది. ఈ జిల్లా నుంచి 21,358 మంది పరీక్షలు రాస్తే, 20,780 (97.29 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 59.46 శాతం ఉత్తీర్ణత నమోదు చేసి వికారాబాద్ జిల్లా ఈ ఫలితాల్లో అట్టడుగున నిలిచింది. ఈ జిల్లా నుంచి 13,399 మంది పరీక్షలు రాయగా, 7,967 (59.46 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు గడువు 26
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చేనెల 14 నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తామని అన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన వారు ఆ ఫలితాల కోసం ఎదురుచూడకుండా ఈ పరీక్షలకు ఫీజు చెల్లించాలని కోరారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు తుది గడువు ఈనెల 26వ తేదీ వరకు ఉందని చెప్పారు. ఆలస్య రుసుం రూ.50తో ఆ సబ్జెక్టు పరీక్ష ప్రారం భానికి రెండు రోజుల ముందు వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని వివరించారు. ఫలితాలు వెల్లడించిన 15 రోజుల్లో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేయా లని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు కోరారు. రీకౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ.వెయ్యి చెల్లించాలని చెప్పారు. ఎస్బీఐ బ్యాంకు ద్వారా చలానా తీసి దరఖాస్తులను నేరుగా కానీ లేదా పోస్టు ద్వారా పంపించాలని కోరారు. డిమాండ్ డ్రాఫ్ట్‌లు అంగీకరించబడవని స్పష్టం చేశారు. రీకౌంటింగ్, రీవెరిపకేసన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసే అవకాశం లేదన్నారు. వివరాల కోసం www. bse.telangana.gov.in వెబ్ సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం : సబిత
ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, బంగారు భవిష్యత్తును కోల్పోవద్దని కోరారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ నాలుగో తేదీ నుంచి ప్రారంభమవుతాయని, ఉన్నత చదువులకు వెళ్లే అవకాశ ముందని చెప్పారు.
ఫెయిలైన పదో తరగతి విద్యార్థులు కూడా సంయమనం పాటించాలని సూచించారు. కుటుంబం లో ముగ్గురిని కోల్పోయినా పదో తరగతి పరీక్షలను విజయవంతంగా నిర్వహించి ఫలితాలను విడుదల చేసిన కృష్ణారావును ఆమె ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయిలో గురుకులాల ఫలితాలు మెరుగ్గా వచ్చాయని చెప్పారు. గురుకులాల తరహాలోనే ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు పట్టుదలతో పనిచేయాలని కోరారు.