Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిఘా లేదు.. నియంత్రణ లేదు
- లోడింగ్ల పేరుతో వసూళ్లు
- అధికారులు, కాంట్రాక్టర్ల సిండికేట్
- వేసవిలోనే సన్న ఇసుక కొరత
- వర్షాకాలంలో ఎలా?
'తెలంగాణ రాష్ట్రంలో ఇసుక మాఫియాకు చెక్‌పెట్టి ప్రతి ఇంటికి తక్కువ ధరకే ఇసుకను సరఫరా చేస్తాం. ఇసుక ధరలను అదుపులో పెట్టి ప్రతి సామాన్యునికి తక్కువ ధరకు ఇసుక అందిస్తాం'అని మంత్రి కేటీఆర్ పలుమార్లు ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇసుక మాఫియా కాంట్రాక్టర్ల రూపంలో రాజ్యమేలుతున్నది.
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంట్రాక్టర్లు చెప్పిందే వేదం, వాళ్లు ఎంతనుకుంటే అంత దోసుడే. ఈ దోపిడీ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులు తప్పవు. అధికారులు సైతం కాంట్రాక్టర్లకే వంతపాడుతున్నారు. ఫలితంగా చిన్నచిన్న లారీ యజమానులకు ఇబ్బందులు తప్పడంలేదు.
డబుల్ ధమాక..
ఇసుక క్వారీలలో బడా కాంట్రాక్టర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. అందుకు అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటున్నాయి. ప్రభుత్వం 35టన్నులకు అనుమతిస్తే లారీలో 70టన్నులను నింపుతున్నారు. రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కుంట్లం-2, పలుగుల, గుండ్రాజుపల్లి, పలుగుల-9, పలుగుల-10, భద్రాదికొత్తగూడెం జిల్లాలోని కత్తిగూడెం, వీరాపురం, ములుగు జిల్లాలోని అక్కనపెల్లి, మల్లారెడ్డిగూడెం, రాజపేట, కరీంనగర్, జోగులాంబగద్వాల్ జిల్లాలోని అనేక క్వారీల నుంచి హైదరాబాద్‌కు ఇసుకను సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజు ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసుకుని లారీలలో నగరానికి ఇసుకను తరలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 16 టైర్ల లారీలకు 35 మెట్రిక్ టన్నుల ఇసుకను, 14 టైర్ల లారీలకు 32, 12టైర్ల లారీలకు 26 మెట్రిక్ టన్నుల ఇసుకను పాసింగ్ విధానంతో కేటాయిస్తున్నది. అయితే కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై పాసింగ్ విధానానికి పాతరేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 35 మెట్రిక్ టన్నులకు బదులు డబుల్ అంటే 70 మెట్రిక్ టన్నుల ఇసుకను తోడేస్తున్నారు.
ప్రభుత్వ ఖజానాకు గండి
ఇసుక ద్వారా ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయానికి అధికారులే గండి కొడుతున్నారు. వేసవికాలంలో రోజుకు 10వేల నుంచి 20వేల వరకు లారీల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. కాంట్రాక్టర్లు 35మెట్రిక్ టన్నుల లారీకి రూ.14,300, 32మెట్రిక్‌టన్నుల లారీకి రూ.13,200, 26మెట్రిక్ టన్నుల లారీకి రూ.10,800 చెల్లిస్తున్నారు. కానీ 35మెట్రిక్ టన్నులకు అనుమతి తీసుకుని 70మెట్రిక్ టన్నుల ఇసుకను తరలిస్తున్నారు. ఈ లెక్కన తక్కువలో తక్కువ రోజుకు రూ.10.80కోట్ల ఆదాయానికి గండిపడుతున్నట్టే. అధికారుల నిఘా లేదు. ఇసుక తరలింపులో నియంత్రణే కరువైంది.
లోడింగ్ పేరుతో రూ.2500 వసూలు
జయశంకర్భూపాలపల్లి, భద్రాదికొత్తగూడెం, ములుగు, కరీంనగర్ జిల్లాలలోని ఇసుక క్వారీల్లో లోడింగ్ పేరుతో రూ.2500 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదేంటని లారీ డ్రైవర్లు ప్రశ్నిస్తే.. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. జేసీబీ పేరుతో రూ.500, కాంటా సీరియల్ పేరుతో రూ.300 వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాస్థాయి అధికారులు మామూళ్ల మత్తులో మునిగితేలుతున్నారు.
సన్న ఇసుక కొరత
వేసవికాలంలో ఎక్కువగా లభ్యమయ్యే సన్న ఇసుక కొరత ఏర్పడింది. రాష్ట్రంలో మూడు క్వారీల్లో మాత్రమే సన్న ఇసుక లభ్యమవుతున్నది. వేసవిలో ఇండ్ల నిర్మాణ పనులు అధికంగా ఉండడంతో దానికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా కొరత ఏర్పడింది. అందుకే ఒక్కొక్క క్వారీకి మూడు రోజుల వ్యవధితో బుకింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. వేసవిలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే వర్షాకాలంలో సన్న ఇసుక పరిసితేంటని బిల్డర్లు, లారీ యజమానులు వాపోతున్నారు. వర్షాకాలంలో సన్న ఇసుకకు భలేగిరాకీ ఉంటుందని భావించిన కొంత మంది డంప్ చేస్తున్నారు.
కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి
రామంతాపూర్, ఉప్పల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి
ఇసుక క్వారీలలో లోడింగ్ పేరుతో వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లిన ఫలితంలేదు.
కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారని లారీ డ్రైవర్ బాలునాయక్ చెప్పారు.
అక్రమ వసూళ్లను ప్రశ్నిస్తే కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే తమ క్వారీలోకి రావద్దంటున్నారు. ఎందుకు బుక్ చేసుకున్నారని ప్రశ్నిస్తున్నారు.