Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థకు శ్రీకారం
- లాంఛనంగా ప్రారంభించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని ప్రతి గడపకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సేవల్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విలేజ్ బస్ ఆఫీసర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థ మరింత పటిష్టమై ప్రజలకు చేరువ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు పక్కా ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1,730 మంది విలేజ్ బస్ ఆఫీసర్లను నియమించినట్టు చెప్పారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థను బుధవారంనాడాయన లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన విలేజ్ బస్ ఆఫీసర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీకి వారే బ్రాండ్ అంబాసిడర్లు అని ప్రకటించారు. ప్రజలకు ఆర్టీసీ యాజమాన్యానికి మధ్య వారు సంధానకర్తల్లాగా వ్యవహారించాలని చెప్పారు. టీఎస్ఆర్టీసీపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంచేలాకషి చేయాలని చెప్పారు. పెండ్లిండ్లు, శుభకార్యాలకు అద్దె బస్సుల బుకింగ్, కార్గో సేవలు, తిరుమల శ్రీవారి దర్శన సదుపాయం, జాతరలు, సంతల సమయాల్లో ఆయా రూట్లలో బస్సు సర్వీసులు ఏర్పాటు చేసేలా డిపో యాజమాన్యంతో సమన్వయం చేసుకుంటూ ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) పెంచేలా కృషి చేయడం వంటి కర్తవ్యాలు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. గ్రామాల్లోని రవాణా అవసరాలకు ఆర్టీసీనే గుర్తొచ్చేలా ప్రజలతో మమేకమవ్వాలని అన్నారు. విధి నిర్వహణలో అత్యున్నత ప్రతిభ కనబరిచే విలేజ్ బస్ ఆఫీసర్లను గుర్తించి సత్కరించి, ప్రోత్సహకాలు ఇస్తామన్నారు. అనంతరం విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థ పోస్టర్, కరదీపికను ఆయన ఆవిష్కరించారు. విలేజ్ బస్ ఆఫీసర్లకు ఐడీ కార్డు, బ్యాగ్ అందజేశారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్(విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, యాదగిరి, సీపీఎం కష్ణకాంత్, సీటీఎం జీవన ప్రసాద్, చీఫ్ మేనేజర్ (ప్రాజెక్ట్స్ అండ్ ఎస్టేట్స్) విజయ్ కుమార్, సీఈఐటీ రాజశేఖర్, బిజినెస్ హెడ్ సంతోష్ కుమార్, సీటీఎం (మార్కెటింగ్) సుధా పరిమళ, సికింద్రాబాద్, హైదరాబాద్ ఆర్ఎంలు వెంకన్న, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.