Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూలో పీహెచ్డీ ఫీజు పెంపునకు వ్యతిరేకంగా పోరాడుదాం
- నియంతలా వ్యవహరిస్తున్న వీసీ : ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్కి మహేసరి
నవతెలంగాణ-ఓయూ
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కాపాడుకొని.. ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా పోరాడుదామని ఏఐఎస్ఎఫ్ జాతీయ జనరల్ సెక్రెటరీ విక్కి మహేసరి పిలుపునిచ్చారు. ఏఐఎస్ఎఫ్ ఓయూ కౌన్సిల్ ఆధ్వర్యంలో బుధవారం డిస్కోర్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి 3 శాతం నిధుల కంటే ఎక్కువ కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తూ విద్యను కార్పొరేటీకరణ చేస్తున్నదన్నారు. పాఠ్యపుస్తకాల నుంచి భగత్ సింగ్ గురించి, గాంధీని హత్య చేసిన గాడ్సే ఉదంతం పాఠాన్ని, డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని తొలగించి విద్యని కాషాయీకరణే లక్ష్యంగా మార్చుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను ఏకం చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామన్నారు. పార్లమెంటులో భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ చట్టం చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్లు, విద్యార్థులు కూడా కలవడానికి సమయం ఇవ్వకుండా ఓయూ వీసీ నియంతృత్వంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామిక వాతావరణాన్ని దెబ్బతీసున్నారని విమర్శించారు. దేశంలో ఏ యూనివర్సిటీలో లేనివిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ ఫీజు రూ. 2000 నుంచి రూ. 20వేలకు పెంచడం పేద, మధ్య తరగతి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయడమే అన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై త్వరలోనే ఏఐఎస్ఎఫ్ నేషనల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు అశోక్ స్టాలిన్, మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, గ్యారా నరేష్, రహమాన్, నెల్లి సత్య, సాయి భగత్, లెనిన్ పాల్గొన్నారు.