Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ 5 నుంచి సరుకుల పంపిణీకి బ్రేక్
- ఇప్పటికే పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు నోటీసు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సమస్యల పరిష్కారం కోసం రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టనున్నారు. జూన్ 5వ తేదీ నుంచి రేషన్ దుకాణాలు బంద్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే డీలర్ల సంఘం ప్రతినిధులు గత నెల 20వ తేదీన పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను కలిసి డిమాండ్ల నోటీస్ అందజేశారు. డీలర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపకపోతే వచ్చే నెల నుంచి సరుకుల పంపిణీని నిలిపి వేసి సమ్మె చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు సమ్మెకు వెళ్తే పేదలకు బియ్యం పంపిణీ ప్రక్రియ ఆగిపోనుంది.
రాష్ట్రంలో 17,250 రేషన్ దుకాణాలున్నాయి. వీటి పరిధిలో జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్ఎఫ్ఎస్ఎ) కింద 35 లక్షల రేషన్ కార్డులతో పాటు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 53 లక్షల రేషన్ కార్డులు కలిపితే మొత్తం 88 లక్షల రేషన్‌కార్డులకు ప్రతి నెలా రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులో నమోదైన ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం చొప్పున రూ.1 అందజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున రూ.3లకు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 2023-24లో పౌరసరఫరాల శాఖకు రూ.3117 కోట్లు ప్రకటించింది. రేషన్‌కార్డుల అంత్యోదయ, పుడ్ సెక్యూరిటీ కార్డుల ద్వారా రాష్ట్రంలో 1.9 కోట్ల మందికి రేషన్ బియ్యం అందుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 3,81,375 రేషన్‌కార్డులకు ప్రతి నెలా 6783 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది. మెదక్ జిల్లాలో 2,15,165 రేషన్‌కార్డులున్నాయి. సిద్దిపేట జిల్లాలో 3.50 లక్షల కార్డులున్నాయి. పేదలకు రేషన్ సరుకులు పంపిణీ చేయడంలో రేషన్ డీలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
వలస పేదలపై సమ్మె ప్రభావం తీవ్రం
రేషన్ డీలర్లు సమ్మె చేస్తే వలస పేదలకు తీవ్రమైన అన్యాయం జరిగే ప్రమాదముంది. తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, వరంగల్ ఇతర పెద్ద పట్టణాలకు చత్తీస్గడ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ వంటి రాష్ట్రాలకు చెందిన పేదలు హమాలీ, కంపెనీ, నిర్మాణ రంగంలో ఉపాధి కోసం వలసొచ్చారు. తెలంగాణకు చెందిన రేషన్దారులతో పాటు వలస పేదలకు కూడా రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేయబడుతుంది. తెలంగాణలో రేషన్ డీలర్లు సమ్మెకు పోవడం వల్ల బియ్యం సరఫరా నిలిచిపోతుంది. సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, సిద్దిపేట, మెదక్, తూప్రాన్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో రైస్‌మిల్లులు, కంపెనీలు, ఇటుకబట్టీలు, నిర్మాణ రంగంలో పనిచేసేందుకు 30 వేల వరకు వలస కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ ఆయా రాష్ట్రాల్లో రేషన్కార్డులున్నందున తెలంగాణలో వన్ నేషన్ వన్ రేషన్ కింద నివాస ప్రాంతాల్లోనే సరుకులు పొందుతున్నారు.
ప్రధాన డిమాండ్లు
పౌర సరఫరాల శాఖ పరిధిలో రేషన్ దుకాణాల నిర్వాహణ కొనసాగుతుంది. ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న రేషన్ డీలర్ల తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు నోటీస్ ఇచ్చారు. అందులో ప్రధానంగా రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. దాంతో పాటు ప్రతి రేషన్ డీలర్‌కు హెల్త్‌కార్డు ఇవ్వాలని, కరోనా సమయంలో మృతి చెందిన 99 మంది రేషన్ డీలర్ల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. శాశ్వత ఆథరైజేషన్ ఇవ్వాలని, గన్నీ సంచుల ధర రూ.30 పెంచా లని, కారుణ్య నియామకాలను 62 సంవత్సరాల వరకు పెంచాలని, 1 శాతం తరుగు ఇవ్వాలని కోరారు. తరుగు ప్రతి నెలా క్లోసింగ్ బ్యాలెన్స్ నుంచి ఈ-పాస్ మిషన్ నుంచి తీసివేయాలి. కార్పొరేషన్ వద్ద వివిధ రూపాల్లో జమ అయి ఉన్న వందల కోట్ల రూపాయలతో సివిల్ సప్ల కమిషనర్, డీలర్ల అసోషియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఫండ్ ఏర్పాటు చేసి డీలర్లకు అవసరాన్ని బట్టి రుణాలివ్వాలి. ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి.
దీర్ఘకాలంగా సమస్యలు పెండింగ్
తెలంగాణ రేషన్ డీలర్ల సమస్యలు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 11 రకాల డిమాండ్లతో కూడిన నోటీస్ ఇచ్చాం. పౌరసరఫరాల కమిషనర్‌కు డిమాండ్ల నోటీస్ ఇచ్చి 45 రోజులు గడిచాకనే సమ్మెకు పోతున్నాం. జూన్ 5 వరకు ప్రభుత్వం స్పందించాలి. చర్చలు జరిపి మా డిమాండ్లను పరిష్కరించాలి. ప్రజలకు సరుకుల పంపిణీ ఆగిపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయని తెలుసు. కానీ.. మా సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు పోకతప్పట్లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి డీలర్ల సమస్యలు పరిష్కరించాలి.
నాయకోటి రాజు, తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు.