Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలగిస్తామంటూ ఇండ్లకు నోటీసులు
- ఎంపీడీవోల నుంచీ తీవ్ర ఒత్తిడి
- సంఘీభావం తెలుపుతున్న సీపీఐ(ఎం), విపక్షాలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నాలుగేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ ముగిసిన నేపథ్యంలో తమ సర్వీసును క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో పక్షం రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)పై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. సమస్యను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నట్టు సంకేతాలు పంపుతూనే.. హెచ్చరికలూ చేస్తోంది. దీనిలో భాగంగా విధుల్లో చేరని పంచాయతీ కార్యదర్శు లను తొలగిస్తామంటూ ఇండ్లకు నోటీసులు అంటిస్తోంది. ఈ చర్యతో.. ఉద్యోగం నుంచి తీసివేస్తారేమోనని పలువురు జేపీఎస్‌లు భయాందోళనకు గురవుతు న్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం భయపడ కుండా సమ్మె కొనసాగిస్తు న్నారు. గత మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా విధుల్లో చేరకపోతే టెర్మినేట్ చేస్తామనే హెచ్చరికలతో కూడిన నోటీసులను రాష్ట్రంలోని 9,355 మంది పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వడంతో కొందరు విధుల్లో చేరారు. వీరిలో ధైర్యం నింపి తిరిగి సమ్మెలోకి వచ్చేలా జేపీఎస్ నేతలు ప్రయత్నిస్తుండగా.. ఎంపీడీవోలు అడ్డుకునేందుకు పూనుకుంటున్నారు. విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు ఊడుతాయంటూ ఎంపీడీవోలు తమ పరిధిలోని కార్యదర్శులకు హెచ్చరికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో పలువురు ఎంపీడీవోలు ఇలాంటి అల్టిమేటం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎంపీడీవోలు కూడా వివిధ సమస్యలపై ఆందోళనలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలోనూ ఇదే తరహాలో జరుగుతున్నట్టు తెలిసింది.
నాలుగేండ్లయినా అదే తీరు..
2019 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామానికి ఓ కార్యదర్శి ఉండాలనే తలంపుతో ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రిక్రూట్ చేసింది. 2018లోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో మూడేండ్ల ప్రొబేషన్ పీరియడ్‌గా పేర్కొంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసెంబ్లీ సాక్షిగా మరో ఏడాది పాటు ప్రొబేషన్ కాలపరిమితి పెంచినా పంచాయతీ కార్యదర్శులు మిన్నకుండి ప్రభుత్వానికి సహకరించారు. విధుల్లో చేరి నాలుగేండ్లు పూర్తయ్యాక కూడా రెగ్యులరైజ్ చేయకపోవడంపై ఆందోళనకు దిగి సమ్మె కొనసాగిస్తున్నారు.కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని, అలాగే జాతీయ స్థాయిలో ఇటీవల తెలంగాణకు 13 స్వచ్ఛ అవార్డులు రావడంలోనూ జేపీఎస్లే కీలకంగా పనిచేశారనే విషయాన్ని వారు సమ్మె సందర్భంగా లేవనెత్తుతున్నారు.
విధుల్లో చేరికపై ఊగిసలాటలో జేపీఎస్‌లు..
క్రమబద్ధీకరణపై సమ్మె కొనసాగించాలని జేపీఎస్‌లు పట్టుదలతో ఉన్నప్పటికీ ప్రభుత్వ నోటీసులతో సర్వీసు నుంచి రిమూవ్ చేస్తారనే భయం వారిని వెంటా డుతోంది. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల్లో పలువురు విధుల్లో చేరుతున్నారు. కొందరు విధుల్లో చేరిన వారు సైతం వెనక్కి వచ్చి సమ్మె కొనసాగిస్తున్నారు. మరికొందరు మెడికల్ లీవ్‌లో ఉన్నా ప్రభుత్వం వారి సెలవును పరిగణలోకి తీసుకోకుండా నోటీసులు జారీ చేయడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం జిల్లాలో 463 మందికి గాను 60 మంది కార్యదర్శులు విధుల్లో చేరారు. విధుల్లో చేరని వారి విషయమై ప్రభుత్వానికి నివేదించినట్టు డీపీవో వీవీ అప్పారావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 377 మందికి 15 మంది విధుల్లో చేరారు. అధికారుల ఒత్తిడి భరించలేకే విధుల్లో చేరామని వారంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1108 మందికి మహబూబ్‌నగర్‌లో 26 మంది విధుల్లో చేరారు. వారిలో 13 మంది వెనక్కి వచ్చారు. నాగర్‌కర్నూల్‌లో ఆరుగురు చేరినా తిరిగి సమ్మెలో పాల్గొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 882 మంది ఉండగా సెలవులో ఉన్నవారిని సైతం విధుల్లోకి రావాలని అధికారులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. కరీంనగర్లో 260 మంది పూర్తిస్థాయిలో సమ్మెలో ఉన్నారు. రంగారెడ్డి, వికారాబాద్‌లో 646 మందికి సెలవులో ఉన్నవారు తప్ప మిగతావారందరూ సమ్మె కొనసాగిస్తున్నారు. హన్మకొండ జిల్లాలో 129 మందికి 49 మంది విరమించగా 80 మంది సమ్మె కొనసాగిస్తున్నారు.
వివిధ పార్టీలు, సంఘాల మద్దతు
జేపీఎస్‌లకు బీఆర్ఎస్సేతర పక్షాలతో పాటు వివిధ సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. ఖమ్మం నూతన కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె శిబిరాన్ని సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నేతలు గురువారం సందర్శించారు. జేపీఎస్‌ల న్యాయసమ్మతమైన రెగ్యులరైజేషన్ డిమాండ్‌ను నెరవేర్చాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సమ్మెకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంఘీభావం తెలుపుతూ కూసుమంచి ఆందోళనలో పాల్గొన్నారు. జేపీఎస్‌ల రెగ్యులరైజేషన్ విషయమై సీఎంకు లేఖ రాసినట్టు చెప్పారు. జేపీఎస్‌ల ఆందోళనకు మద్దతు తెలిపాలని పార్టీ శ్రేణులకు సైతం పిలుపునిచ్చారు.
విధుల్లో చేరితే సానుకూలంగా స్పందిస్తామంటున్న మంత్రి
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగంలో చేరేటప్పుడే యూనియన్ పెట్టం, సమ్మెకు దిగం, ప్రభుత్వం ఎప్పుడు క్రమబద్ధీకరించినా తమకు సమ్మతమే అని తెలిపిన జేపీఎస్‌లు సమ్మెకు దిగడం సమంజసం కాదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అంటున్నారు. రెగ్యులరైజేషన్ తప్పకుండా అవుతుందని, సీఎం కేసీఆర్ స్కేల్కూడా ఇచ్చారనే విషయాన్ని మంత్రి ప్రస్తావిస్తున్నారు. అగ్రిమెంట్‌కు వ్యతిరేకంగా జేపీఎస్‌లు వ్యవహరించటం సరికాదంటున్నారు. సమ్మె విరమించి విధుల్లో చేరితే సానుకూలంగా స్పందిస్తామని మంత్రి చెబుతున్నారు. అగ్రిమెంట్ ప్రకారం కోర్టులకు వెళ్లినా చెల్లుబాటు కాదని అంటున్నారు.