Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మె విరమించండి : మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలిచిందని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మెను వారు వెంటనే విరమించాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం తరపున తానుగానీ, మరెవ్వరు గానీ వారిని చర్చలకు పిలవలేదని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు పంచాయతీ కార్యదర్శుల పట్ల మంచి అభిప్రాయం ఉందనీ, దాన్ని చెడగొట్టుకోవద్దని సూచించారు. ప్రభుత్వాన్ని శాసించాలని సాహసించడం, నియంత్రించాలని అనుకోవడం పెద్ద తప్పు అని తెలిపారు. సమ్మె విరమిస్తే వారికి సీఎం కేసీఆర్ తప్పకుండా న్యాయం చేస్తారనే నమ్మకం తనకుందని పేర్కొన్నారు. సంఘాలు పెట్టుకోబోమనీ, యూనియన్లలో చేరబోమనీ, సమ్మెలు చేయబోమని బాండ్ రాసిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. జేపీఎస్‌లు సమ్మె చేయడం ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధమని తెలిపారు. సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడాన్ని ఆపాలని హెచ్చరించారు. ఇప్పటికైనా మించిపోలేదనీ, వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని సూచించారు.