Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితున్ని అప్పగించాలని గ్రామస్తుల ఆందోళన
- పోలీస్ వాహనాలు ధ్వంసం
- పెద్దపల్లి జిల్లా బట్టుపల్లిలో కలకలం
నవతెలంగాణ - మంథని
గతంలోనే భార్యను చంపేసిన దుండగుడు గురువారం పదేండ్ల కూతురినీ నరికి హత్య చేశాడు. అనంతరం గ్రామంలో మరొకరిపై దాడి చేశాడు. ఈ దారుణ సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లిలో జరిగింది. కాగా, నిందితుడిని తమకు అప్పగించాలని గ్రామస్తులు ఆందోళన చేశారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల సదానందం తన కూతురు రజితను(10) గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం గ్రామంలో మరో వ్యక్తి ధూపం శ్రీనివాస్‌పైనా దాడి చేశాడు. శ్రీనివాస్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సదానందం గతంలో భార్యను ఉరేసి హత్య చేశాడు. ఆ కేసులో జైలు జీవితం గడిపి వచ్చాడు. ఇప్పుడు కూతురినీ చంపేశాడు.
సమాచారం అందుకున్న మంథని సీఐ సతీష్, ఎస్ఐ వెంకటేశ్వర్ తమ సిబ్బందితో బట్టుపల్లికి చేరుకొని నిందితుడు సదానందంను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తమకు అప్పగిస్తే.. తామే శిక్షిస్తామంటూ గ్రామస్తులంతా పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. అడ్డంగా కట్టెలు, బండ రాళ్లు వేసి నిందితున్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని నిలువరించలేక కొంతసేపు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో నిందితునిపై దాడి చేసేందుకు యత్నించారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. సైకో సదానందం వల్ల తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితున్ని మంథని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.