Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేషన్ డీలర్లకు మంత్రి గంగుల విజ్ఞప్తి
- 22న సంఘాలతో సమావేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రేషన్ డీలర్లు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22న వారితో సమావేశం కానున్నట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్లోని తన అధికారిక నివాసంలో పౌరసరఫరాలశాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే సంకల్పంతో రేషన్ బియ్యం పంపిణీకి వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రేషన్ డీలర్లకు ఇబ్బందులు రానివ్వొద్దని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2.82 కోట్ల మందికి రేషన్ అందించేందుకు ప్రతి ఏడాది రూ.3,580 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 17,220 రేషన్ షాపులకుగాను డీలర్లకు రూ.12 కోట్ల మేర కమిషన్ రూపంలో ఇస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే రేషన్ డీలర్లతో పలు దఫాలుగా చర్చించామని వివరించారు. వారి ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు ఉషారాణి, లక్ష్మీభవాని తదితరులు పాల్గొన్నారు.