Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెను నీరుగార్చే కుట్రకు రాష్ట్ర సర్కారు పూనుకున్నదని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జేపీఎస్‌లు గొంతెమ్మ కోర్కెలు ఏమీ కోరడం లేదనీ, ప్రొబిషనరీ పీరియడ్ అయి పోయింది కాబట్టే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వీఆర్వోలు తమ హక్కుల కోసం డిమాండ్ చేస్తే ఆ వ్యవస్థనే సీఎం కేసీఆర్ రద్దు చేశారనీ, ఆర్టీసీ కార్మికుల సమ్మెపైనా ఉక్కుపాదం మోపారని విమర్శిూంచారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెలు, ధర్నాల పట్ల నిరంకుశంగా వ్యవహరించడం తగదనీ, గత ప్రభుత్వాలు ఇలాగే చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద మూలాల సమాచారం బయటకు పొక్కినా హైదరాబాద్‌తో సంబంధం ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు పంటలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే సీఎం కేసీఆర్‌కు కనీసం సమీక్ష చేసే తీరిక కూడా లేదా?అని విమర్శించారు. అన్నదాతలకు పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎగ్జిట్స్పోల్స్ను తాను నమ్మడం లేదనీ, పీపుల్స్పోల్స్ తమ వైపే ఉన్నాయని చెప్పారు. కర్నాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.