Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంబంధాలపై ఇంటెలిజెన్స్ ఆరా
- సమీక్షిస్తున్న రాష్ట్ర హౌం మంత్రి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్ నగరంలో పట్టుబడ్డ ఆరుగురు ఉగ్రవాదులకు సంబంధించిన మూలాలను రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు నిశితంగా శోధిస్తున్నారు. రెండ్రోజుల క్రితం నగరంలో రహస్యంగా మకాం వేసిన ఆరుగురు ఉగ్రవాదులు మహ్మద్ సలీం, జునైద్, రెహ్మాన్, అబ్బాస్, సులేమాన్, హమీద్‌లను మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. వీరిని తదుపరి దర్యాప్తు కోసం మధ్యప్రదేశ్ పోలీసులు భోపాల్‌కు తీసుకెళ్లి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారు. కాగా, హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఈ ఆరుగురు ఉగ్రవాదులు చేస్తున్న కార్యకలాపాలు, రహస్య కదలికలతో పాటు వీరు చేయదల్చుకున్న విధ్వంసాల గురించి మరింత నిశితంగా ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. జగద్గిరిగుట్ట, జవహర్‌నగర్, బాలాజీనగర్, పాత బస్తీల్లో మకాం వేసిన ఈ ఆరుగురు ఉగ్రవాదులు గత 18 నెలలుగా తమ ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి మరికొందరు అమాయకపు ముస్లింలను లోబర్చుకునే ప్రయత్నాలు చేశారని నిఘా అధికారులు అనుమానిస్తున్నారు. అంతేగాక, వివిధ వృత్తులలో కొనసాగుతూ మూడో కంటికి అనుమానం రానీయకుండా తరచుగా రహస్య ప్రదేశాల్లో కలిసేవారని నిఘా అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా, వికారాబాద్ అడవుల్లో వీరు కలుసుకొని తమ వ్యూహాల గురించి ఒకరికొకరు సమాచారమిచ్చుకొని తదుపరి కార్యచరణ గురించి ప్రణాళికలు వేసుకొనేవారని తెలిసింది. అయితే, తాము ఉంటున్న నివాసాల వద్ద మాత్రం తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో ఉంటూ తాము సాగిస్తున్న విద్రోహ కార్యకలాపాల గురించి స్థానికులెవ్వరికి కూడా అనుమానాలకు తావీవ్వకుండా ప్రవర్తించేవారని తెలిసింది. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్తే ఏ రాత్రో ఇంటికి వచ్చేవారని నిఘా అధికారులు సమాచారాన్ని సేకరించారు.
తరచుగా ఏ మసీదులకు వీరు వెళ్లేవారు? అక్కడ ఎవరితో ఎక్కువగా కలిసేవారు? వీరిని తరచూ కలిసేవారెవరు? అనే కోణంలో నిఘా అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. నిజామాబాద్‌లో పీఎఫ్ఐ కార్యకలాపాలతో పాటు నగరం నుంచి గత ఏడాది కాలంలో ఆరుగురికి పైన లష్కర్-ఎ-తోయిబా(ఎల్ఈటీ)తో సంబంధాలు కలిగి ఉన్న ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసిన ఘటనల నేపథ్యంలో తాజాగా ఈ ఆరుగురు హజ్ ఉజ్ తజ్జమీన్కు చెందిన ఉగ్రవాదులు పట్టుబడటంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరింతగా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన రాష్ట్ర హౌం మంత్రి మహమూద్ అలీ.. పట్టుబడ్డ ఆరుగురు ఉగ్రవాదుల గురించి, వారు ఇక్కడ మకాం వేసి నిర్వహిస్తున్న కార్యకలాపాల గురించి ఆరా తీశారని తెలిసింది. ముఖ్యంగా, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్లతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు మరింతంగా అప్రమత్తంగా మెలగాల్సిన అవసరం ఉందంటూ ఆయన అధికారులకు సూచనలు చేశారని తెలిసింది.